ఈ నగరానికి ఏమైంది : ఓవైపు దొంగలు, మరోవైపు తెంపుడుగాళ్లు

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 11:32 AM IST
ఈ నగరానికి ఏమైంది : ఓవైపు దొంగలు, మరోవైపు తెంపుడుగాళ్లు

హైదరాబాద్: ఓవైపు దొంగలు.. మరోవైపు తెంపుడుగాళ్లు.. నగరవాసులను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలు, గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లపై దొంగలు కన్నెస్తే, ఒంటరి మహిళలను టార్గెట్ చేశారు చైన్ స్నాచర్స్. వనస్థలిపురంలో నిత్యం ఏదో ఒక కాలనీలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచినా దొంగలు మాత్రం చిక్కడం లేదు. పోలీసుల కన్నుగప్పి తమ పని కానిచ్చేస్తున్నారు.

ఒక బ్యాచ్ పోతే మరో బ్యాచ్.. రంగంలోకి దిగి వరుసగా చోరీలకు పాల్పడుతోంది. 2018, డిసెంబర్ 26, 27 తేదీల్లో చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌లు వరుస గొలుసు చోరీలతో బెంబేలెత్తించాయి. 15 గంటల్లోనే 12 గొలుసు దొంగతనాలతో రెచ్చిపోయారు. నిమిషాల వ్యవధిలో చోరీలు చేస్తూ జనాలను వణికించారు. సీసీ కెమెరాలు లేని ఏరియాలను సెలెక్ట్ చేసుకుని మరీ పని కానిస్తున్నారు. దీంలో అలర్ట్ అయిన పోలీసులు చైన్ స్నాచర్స్ వేటలో పడ్డారు.

గొలుసు దొంగల జాడ కోసం పోలీసులు పరిగెడుతుంటే, వెనుకనే అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాలు ఎంటర్ అయ్యాయి. సంక్రాంతి పండగను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నాయి. దొంగలు మరోసారి వనస్థలిపురంపైనే ప్రతాపాన్ని చూపారు. అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల తాళాలు పగలకొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ వరుస చోరీలు, స్నాచింగ్‌లతో అటు ప్రజలకు, ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మహానగర భద్రతను సవాల్ చేశాయి. వరుస చోరీలతో అలర్ట్ అయిన పోలీసులు భద్రతను పెంచారు. నిఘాను పెంచారు. పండక్కి ఊరెళ్లేవారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.