ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సమీక్ష

  • Published By: veegamteam ,Published On : April 24, 2019 / 10:27 AM IST
ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల జరిగాయన్న ఆరోపణలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన, ధర్నాలు నిర్వహించారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అనిల్ కుమార్ స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు అపోహలు మాత్రమేనని మంత్రి అన్నారు. విచారణకు త్రిసభ్య కమిటీ వేశామని..తప్పులు జరిగాయని తేలితే వాటికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఈక్రమంలో ఇంటర్ ఫలితాల గందరగోళంపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోకు కుమార్, పలువురు విద్యా శాఖ అధికారుులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల గందరగోళం, విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసనపై చర్చిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారుల నుంచి ప్రాథమికంగా కొద్ది సమాచారం సేకరించారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు రావడంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి ఇవ్వనుంది. 
తప్పు ఇంటర్ బోర్డు, మూల్యాంకనం, గ్లోబరినా సంస్థ దగ్గర జరిగినా విద్యార్థులకు నష్టం కానివ్వబోమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తప్పులు చేసినా అధికారులపైన ఇప్పటికే చర్యలు కూడా తీసుకుంటున్నారు.