Unvaccinated Deaths : అలర్ట్.. 99శాతం కరోనా మరణాలు వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే…

Unvaccinated Deaths : అలర్ట్.. 99శాతం కరోనా మరణాలు వ్యాక్సిన్ తీసుకోనివారిలోనే…

Unvaccinated Deaths

Unvaccinated Deaths : ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అన్ని దేశాలు ముమ్మరంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. తమ ప్రజలకు టీకాలు ఇస్తున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో టీకాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ కరోనా మరణాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది. అయినప్పటికీ కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా రోగులు ఎందుకు చనిపోతున్నారు? అసలు సమస్య ఎక్కడుంది? దీనిపై అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న కొవిడ్ బాధితుల్లో 99.2 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారేనని ఆయన తేల్చారు. ఈ మరణాలు నివారించగలిగేవేనని స్పష్టం చేశారు.

‘కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్న బాధితుల్లో 99 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఉన్నారు. ఇవన్నీ నిర్మూలించగలిగేవే. మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత సమర్థమైన సాధనం మన చేతుల్లో ఉన్నప్పటికీ.. దానిని అందరూ తీసుకోకపోవడం విచారకరం’ అని ఆంటోని ఫౌచీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కోసం ఏదైనా చేసేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో అదృష్టవశాత్తు అమెరికా ప్రజలకు సరిపోయేంత వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం మనందరి శత్రువు కరోనా వైరస్‌ అని.. అందుకే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తప్పనిసరి తీసుకోవాలని అమెరికా ప్రజలకు ఫౌచీ సూచించారు. వ్యాక్సిన్ల పట్ల కొందరిలో వ్యతిరేక భావన ఉందని.. దానిని పక్కనపెట్టాలని ఆంటోని ఫౌచీ విజ్ఞప్తి చేశారు.

కాగా, ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 6లక్షల మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది.

కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ మాత్రమే ఏకైక మార్గం అని ఇప్పటికే నిపుణులు తేల్చారు. మహమ్మారి బారి నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే తప్పనిసరిగా టీకా తీసుకోవాలని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ గురించి ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత సురక్షితమో తెలుపుతున్నాయి. టీకా తీసుకుంటే కరోనా బారిన పడ్డా.. ఆసుపత్రి పాలవ్వాల్సిన అవసరం ఉండదని, ఐసీయూకి వెళ్లే అవసరం రాదని, ప్రాణాపాయం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అయినా ఇంకా చాలామందిలో వ్యాక్సిన్ల గురించి అనేక అపోహలు, అనుమానాలు, భయాలు నెలకొని ఉన్నాయి.

టీకా తీసుకోని వారితో వాళ్ల ఆరోగ్యానికే కాదు.. వారి వల్ల ఇతరులకూ ముప్పు ఎక్కువేనని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌ సోకిన శరీరాలే కొత్త వేరియంట్లు ఉద్భవించడానికి కారణమనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోని ప్రజలు కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లకు ఫ్యాక్టరీలుగా మారే అవకాశం ఉందని అమెరికాలోని వ్యాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విలియం షాఫ్‌నర్‌ అన్నారు. టీకాలు తీసుకోనివారి సంఖ్య ఎక్కువగా ఉంటే.. వైరస్‌ వ్యాప్తి రెట్టింపు స్థాయిలో పెరగడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలా విస్తృతి పెరిగి వైరస్‌ మార్పులకు (మ్యుటేషన్‌) గురవుతుందని.. దాంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు.