Russia ukraine war : ‘యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి’..అమెరికా,పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి 100రోజులు దాటిపోయాయి. కానీ ఇంకా యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈక్రమంలో ‘యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి’ అంటూ అమెరికా,పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

Russia ukraine war : ‘యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి’..అమెరికా,పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్

Russia ukraine war : తక్కువగా అంచనా వేయడమో.. సరైన ప్రణాళిక లేకపోవడమో..యుక్రెయిన్ విషయంలో రష్యాకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది.యుద్ధం మొదలై వందరోజులు పూర్తయినా..యుక్రెయిన్ ఇంకా దీటుగా సమాధానం ఇస్తోంది.నిజంగా యుక్రెయిన్‌ బలంగా ఉందా..రష్యా బలహీనంగా ఉందా..వందరోజులు దాటిన వార్‌ నేర్పిన పాఠాలు ఏంటి..ఇకపై రష్యా వ్యూహాలు ఎలా ఉండే అవకాశం ఉంది ?

సైనిక చర్య పేరుతో యుద్ధానికి దిగిన రష్యా.. యుక్రెయిన్‌లో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటికిప్పుడు యుద్దం ఆగినా.. అంతా నార్మల్ కావడానికి దశాబ్దాలు పడుతుంది. ఇంత చేసీ యుక్రెయిన్‌పై రష్యా పట్టు సాధించిందా అంటే.. అదీ లేదు ! గట్టిగా వారంరోజుల్లో రష్యా చేతుల్లో యుక్రెయిన్ వస్తుందని అంచనా వేశారంతా ! ఐతే సీన్ రివర్స్ అయింది. రష్యాకు సరైన ప్రిపరేషన్ లేకపోవడం, పట్టు లేని ప్రణాళికకు తోడు.. యుక్రెయిన్ వీరత్వం.. పుతిన్ ఆశల మీద నీళ్లు జల్లింది. ఐతే ఇప్పటివరకు ఒకెత్తు.. ఇకపై ఒకెత్తు అన్నట్లు.. పుతిన్‌ సేనలు మరింత దూకుడు చూపిస్తున్నాయ్. రష్యా, యుక్రెయిన్ యుద్ధం వంద రోజులు దాటింది. స్వాధీనం చేసుకునే వరకు తగ్గేదే లే అని రష్యా అంటుంటే.. ఆక్రమిస్తానంటే ఊరుకుంటామా ప్రతాపం చూపిస్తామని యుక్రెయిన్ అంటోంది. దీంతో యుద్ధం రోజుకింత భీకరంగా మారుతోంది. ఇక అటు అమెరికాతో సహా నాటో దేశాలు.. యుక్రెయిన్‌కు భారీగా క్షిపణులు సరఫరా చేస్తుండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనిపై సీరియస్‌ అయ్యారు. ఇలానే క్షిపణులు సరఫరా చేస్తే.. తాము కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి వస్తుందని.. పరోక్షంగా అమెరికా సహా పలు దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.

వంద రోజులు దాటిన యుద్ధం.. రష్యాకు నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు. యుక్రెయిన్‌లో ఎదుర్కొన్న అనేక పరిస్థితులకు… రష్యన్ మిలిటరీకి తగినంత తేలికపాటి పదాతిదళ బలగాలు లేకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ కొరత కారణంగా రష్యా వైమానిక యూనిట్లు భారీ నష్టాలు అనుభవిస్తున్నాయన్నది చాలామంది అభిప్రాయం. రష్యన్ దళాలకు మోటరైజ్డ్ రైఫిల్ పదాతిదళం, డిస్‌మౌంటెడ్‌ యూనిట్లు కాకుండా… ఆర్టిలరీ, ఆర్మర్‌, సపోర్ట్‌, ఎనేబ్లెర్స్‌ ఉన్నాయ్‌. పట్టణ ప్రాంతాల్లో పోరాడుతున్న ట్యాంక్ యూనిట్‌లకు, భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పదాతి దళ సపోర్టు చాలా కీలకం. ఐతే అందులో కొరత ఉండడమే.. రష్యాకు ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తోంది.

దీనికితోడు కొంతకాలంగా ఆయుధ, ఆహార సరఫరాలు కూడా రష్యాను ఇబ్బంది పెట్టాయ్. ఐతే ఇప్పుడు అవి పూర్తిగా పుంజుకున్నాయ్. దీంతో రష్యా సైన్యాలు రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంది. పుతిన్ టార్గెట్‌గా పెట్టుకున్న తూర్పు యుక్రెయిన్‌లోని డోన్బాస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయ్. అక్కడ దాడుల తీవ్రతను బాగా పెంచుతున్నాయ్. డోన్బాస్‌లో యుక్రెయిన్‌ కదలికలకు కీలకమైన పలు వంతెనలను రష్యా దళాలు పేల్చేశాయ్. ఇదే దూకుడు ఇకపై కంటిన్యూ చేసి.. యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాలని రష్యన్‌ బలగాలు ప్లాన్ చేస్తున్నాయ్.

లుహాన్స్‌క్ ప్రాంతంలో యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న చివరి నగరాలైన… సెవరోడొనెట్స్‌క్‌, లిసిషాన్స్‌క్‌పై రష్యన్‌ బలగాలు క్రమంగా పట్టు సాధిస్తున్నాయ్. పలు అపార్ట్‌మెంట్‌ భవనాలపై భారీగా కాల్పులకు దిగుతున్నాయ్. అక్కడ యుక్రెయిన్ దళాలతో స్ట్రీట్‌ ఫైట్‌ కూడా జరుగుతోంది. సెవరోడొనెట్స్‌క్‌లో 90శాతం రష్యా చేతుల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. డోన్బాస్‌లోని రెండో ప్రధాన ప్రాంతమైన డొనెట్స్‌క్‌లో బఖ్ముత్‌ నగరంపైనా రష్యా దాడుల తీవ్రత పెరిగింది. ఈ ధాటికి యుక్రెయన్‌ సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక అటు యుక్రెయిన్‌పై ఎలక్ట్రానిక్‌ యుద్ధ వ్యూహాన్ని కూడా రష్యా అమలు చేస్తోంది. ఎలక్ట్రానిక్ వార్ టీమ్‌ ఓ బోగస్ కాల్ చేస్తుంది.. అది లిఫ్ట్ చేసిన సైనికుడి వివరాలు తెలుసుకుంటుంది. ట్రాప్‌ చేసి డ్రోన్ల ద్వారా కానీ, క్షిపణి ప్రయోగాల ద్వారా కానీ దాడి చేస్తుంది. ఇదే ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యూహం. యుక్రెయిన్‌ను మొదట్లో తక్కువగా అంచనా వేసిన రష్యా.. దీన్ని ప్రయోగించలేదు. ఐతే ఇప్పుడు దూకుడు మరింత పెంచింది. ఇక అటు తమ పరిధిలోకి వచ్చే యుక్రెయిన్‌ డ్రోన్లను, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను రష్యన్లు సక్సెస్‌ఫుల్‌గా జామ్‌ చేస్తున్నారు. యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునే వరకు.. పుతిన్ సేన తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఐతే ఇప్పుడు రష్యా దూకుడు చూస్తే.. విధ్వంసం అంతకుమించి అనిపించడం ఖాయం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.