BJP Party : ఏపీ, తెలంగాణసహా పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మార్పు..? తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఎవరంటే ..
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకూడా ఖాయమని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

bharatiya janata party
BJP Party: మరో ఏడాది కాలంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో సంస్థాగత మార్పులకు బీజేపీ కేంద్ర అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులను మార్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అధ్యక్షులను మార్పుచేసి, కొత్తవారిని నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజును అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తున్నట్లు జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. 2020 జులై 27న ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నియామకం అయ్యారు. అయితే, సోము వీర్రాజు స్థానంలో సత్యకుమార్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
బండి సంజయ్ మార్పు ఖాయమా?
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుకూడా ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి అధ్యక్ష బాధ్యతలు పార్టీలోని సీనియర్ నేతలకు అప్పగించాలని బీజేపీ కేంద్ర అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. సంజయ్ 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. ఇదిలాఉంటే.. కేంద్ర పార్టీ పెద్దల పిలుపుతో బండి సంజయ్ రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతానికి సంజయ్ ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న బిఎల్ సంతోష్ ను కలిసిన బండి సంజయ్.. మంగళవారం జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులు, నాయకత్వ మార్పు, తదుపరి బాధ్యతలు సహా కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ మార్పు అనివార్యమైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరిలో ఒకరికి తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు ..
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, గుజరాత్, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అధ్యక్షులను మార్చేందుకు బీజేపీ కేంద్ర అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఓటమికి బాధ్యత వహిస్తూ నిలిన్ కుమార్ కటీల్ అధ్యక్ష బాధ్యతలకు రాజీనామా చేశారు. అతని స్థానంలో కొత్తగా వేరేవారికి అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అధిష్టానం అప్పగించనుంది. అదేవిధంగా మధ్యప్రదేశ్ అధ్యక్షుడుగా నరేంద్ర సింగ్ తోమర్ పేరును పరిశీలిస్తుండగా, పంజాబ్ బీజేపీ అధ్యక్ష రేసులో సునీల్ జాకర్ ఉన్నారు. ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడుగా ధర్మేంద్ర ప్రధాన్. రాజస్థాన్ అధ్యక్షుడుగా గజేంద్ర సింగ్ షేకవత్ పేర్లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరిశీలిస్తున్నట్లు బీజేపీ వర్గాలు ద్వారా తెలిసింది.