Bhakti : శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, తిరుపతిలో ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో కూడా వ్రతాలు నిర్వహించారు.

Ttd
Varalakshmi vratham: శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో కూడా వ్రతాలు నిర్వహించారు. దేవస్థానం చంద్రవతి కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈవో కేఎస్ రామారావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రత కార్యక్రమంలో…సుమారు 800 మందికిపైగా మత్తైదువులు పాల్గొన్నారు.
దేవాలయ అర్చక వేద పండితులు తొలుత గణపతి పూజ, స్వామి అమ్మవార్లను ఆశీంప చేసి…వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి అవాహన కళశస్థాపనతో షోడశోపచార క్రతువులను జరిపించారు. వ్రతంలో పాల్గొన్న వారందరికీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి రవిక, గాజులు శేషవస్త్రంగా అందించి తీర్థప్రసాదాలు అందించారు. కరోనా నిబంధనలకు లోబడి వ్రతాలు, పూజలు నిర్వహించారు.
మరోవైపు..
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాలలో హోమాలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి వారిని ఊరేగించారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.