నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం : ఇస్రో శాస్త్రవేత్తలు

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 11:46 AM IST
నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం : ఇస్రో శాస్త్రవేత్తలు

విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది అని తెలుసుకోవటం కోసం 130 మంది కోట్ల భారతీయులతో పాటు ప్రపంచదేశాలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. సెప్టెంబర్ 07వ తేదీ శనివారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కానుంది. చందమామపై అడుగుపెట్టేందుకు 15 నిమిషాలు అత్యంత కీలకమని, చాలా సంక్లిష్టతతో కూడుకున్నదని..ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. 

చంద్రయాన్ – 2 విజయవంతం అయ్యేందుకు మానవ ప్రయత్నాలన్నీ చేశామన్నారు. ప్రయోగం క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతా తాము అనుకున్నట్లుగానే జరుగుతోందని.. నెలవంకను అందే అపూర్వమైన చారిత్రక ఆవిష్కరణ కోసం తామెంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువును మన చేతుల్లో అప్పుడే పెడితే ఎలా ఉంటుంది.. ఏ సాయం లేకుండా మనం పట్టుకోలేం.. ఎటు కదులుతుందో.. తెలియక చాలా ఆందోళన పడుతాం కదా అన్నారు. అలాగే చంద్రయాన్ – 2 కూడా చంద్రుడిపైకి ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు. దూరదర్శన్, ఇస్రో వెబ్ సైట్, యూ ట్యూబ్, ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాల్లో అద్భుత ఘట్టం వీక్షించవచ్చని ఇస్రో అధికారులు వెల్లడించారు. 

చంద్రయాన్ – 2 ప్రయోగం చూడటానికి ప్రధాన మంత్రి మోడీ కూడా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎంపికైన 60 మంది విద్యార్థులు కూడా పరీక్షను చూస్తారని వెల్లడించారు. జులై 22వ తేదీ శ్రీహరి కోట సతీష్ ధావన్ కేంద్రం నుంచి చంద్రయాన్ – 2 ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. 
Read More : Chandrayaan 2’s : విక్రమ్ ల్యాండర్ ఇలా దిగనుంది..వీడియో వైరల్