రాష్ట్రపతి బడ్జెట్ స్పీచ్ బాయ్ కాట్ చేస్తాం..16 పార్టీల సంయుక్త ప్రకటన

రాష్ట్రపతి బడ్జెట్ స్పీచ్ బాయ్ కాట్ చేస్తాం..16 పార్టీల సంయుక్త ప్రకటన

16 Opposition parties శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ..పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్లు 16 విపక్ష పార్టీలు(ఎన్సీపీ,జేకేఎన్సీ,డీఎంకే,టీఎంసీ,శివసేన,ఎస్పీ,ఆర్జేడీ,సీపీఐ(ఎం),సీపీఐ,ఐయూఎంఎల్,ఆర్ఎస్పీ,పీడీపీ,ఎండీఎంకే,కేరళ కాంగ్రెస్(ఎం),ఏఐయూడీఎఫ్,కాంగ్రెస్) ప్రకటించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రకనటన విడుదల చేశాయి.

ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలు పాస్ చేశారని ఆ ప్రకటనలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతుందన్నాయి. ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోయి ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. ఆ కారణంగానే రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని,ఈ ఆందోళనల్లో దాదాపు 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి.

గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో కేంద్రం పాత్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని విపక్షాలు డిమాండ్​ చేశాయి. రిపబ్లిక్​ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఓ రైతు మృతి చెందగా, 300మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. కాగా ప్రస్తుతానికి కాంగ్రెస్ సహా16 రాజకీయ పార్టీలే రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించినప్పటికీ.. మరికొన్ని తటస్థ పార్టీలు సైతం ఈ ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.