సల్లేఖన దీక్ష : 72 ఏళ్ల జైన వృద్దురాలు కన్నుమూత

  • Published By: madhu ,Published On : February 9, 2019 / 10:48 AM IST
సల్లేఖన దీక్ష : 72 ఏళ్ల జైన వృద్దురాలు కన్నుమూత

వెల్లూరు : సల్లేఖన దీక్ష చేపట్టిన 72 సంవత్సరాల జైన వృద్ధురాలు తుదిశ్వాస విడిచింది. రాజస్థాన్‌‌కు చెందిన శ్రీ సుగున్తాన్‌మతి మాతాజీ ఫిబ్రవరి 1వ తేదీ నుండి దీక్ష చేపట్టారు. తిరువనమలై జిల్లాలోని అరిహంతగిరి దిగంబర్ జైన్ మఠ్‌లో ఆమె ఈ దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఎలాంటి ఆహారం, మంచినీరు ముట్టలేదు. మొత్తం ఏడు రోజుల అనంతరం స్థానికంగా ఉన్న వైద్యుడు ఈమె ఆరోగ్య పరిస్థితిని పరిక్షించారు. అప్పటికే ఆమె కన్నుమూసిందని వైద్యులు వెల్లడించారని మఠ్ శుక్రవారం ప్రకటించింది. మాతాజీ అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 

2018, సెప్టెంబర్ 24వ తేదీ వరకు మితమైన ఆహారం తీసుకొనే వారు. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉన్న జైన ఆలయాలకు వెళ్లాలని ఈమె నిర్ణయించుకున్నారు. తిరుమలైకి చేరుకున్న అనంతరం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఘన పదార్థాలను తీసుకోవద్దని జనవరి 25 నిర్ణయించుకున్నారు. కేవలం నీళ్లు మాత్రమే తాగేది. తరువాత వీటిని కూడా ఆమె వదిలేశారు. 

జైన సంప్రదాయంలోని ఉపవాసాల్లో అత్యంత కఠినమైన దీక్ష సల్లేఖన. పూర్తిగా ఆమరణ నిరహార దీక్ష లాంటిదని చెప్పవచ్చు. ఆహారం..క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తుంటారు. చివరకు పూర్తిగా ఆహారాన్ని ముట్టుకోరు. ప్రాణాలు పోయేంత వరకు దీక్షలోనే కొనసాగుతారు. కొన్ని నెలల పాటు దీక్షలో ఉండి..శరీరాన్ని వదిలేస్తారు.