దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : రజనీకాంత్ ను అమిత్ షా కలుస్తారా ?

  • Published By: madhu ,Published On : November 21, 2020 / 11:31 PM IST
దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : రజనీకాంత్ ను అమిత్ షా కలుస్తారా ?

Amit Shah’s likely meeting with Rajinikanth : దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని చూస్తోందా? అమిత్‌ షా తమిళనాడు పర్యటన ఆంతర్యం ఏంటి? డీఎంకేకు షాకిచ్చేందుకు అళగిరితో బీజేపీ చేతులు కలుపుతుందా? మరోవైపు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని అన్నాడీఎంకే ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రెండు రోజుల తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.



వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీని పటిష్ట పరచే దిశగా అమిత్‌ షా పావులు కదుపనున్నట్లు తెలుస్తోంది. డీఎంకేకు షాకిచ్చేందుకు దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరితో చేతులు కలపాలని బీజేపీ చూస్తోంది. అళగిరి ఇప్పటికే కొత్త పార్టీ పెడతానని ప్రకటించడంతో బీజేపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను కూడా షా కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.



చెన్నైకి చేరుకున్న తర్వాత..షా..దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు నివాళి అర్పించారు. తమిళనాడులో రూ.61,843 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2కు అమిత్‌షా శంకుస్థాపన చేశారు. రూ.380 కోట్లతో తెర్వైకండిగై వద్ద నిర్మించిన కొత్త రిజర్వాయర్‌ను చెన్నై ప్రజలకు అంకితం చేశారు. పళని ప్రభుత్వాన్ని అమిత్‌ షా పొగడ్తలతో ముంచెత్తారు అమిత్‌ షా. పళనిస్వామి హయాంలో తమిళనాడు ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని, సుపరిపాలనలో ఈ ఏడాది తమిళనాడు మొదటి స్థానంలో నిలిచిందని కొనియాడారు.



వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వచ్చే ఎలక్షన్స్‌లో అధిక స్థానాలు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



అటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెన్నై పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ వద్ద నడుస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో ఆయనపై ఓ వ్యక్తి ప్లకార్డు విసిరాడు. షాకు దూరంగానే అది పడిపోయింది. ప్లకార్డు విసిరిన 67ఏళ్ల దురైరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి షా పర్యటనతో తమిళనాడు రాజకీయాలు హీటెక్కాయి.