గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరో షాక్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరో షాక్

another shock for lpg cylinder users: ఇప్పటికే గ్యాస్ సిలిండర్లకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని భారీగా తగ్గించేసి వినియోగదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం త్వరలో వారికి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇకపై వారం వారం మోతెక్కనున్నాయి. గ్యాస్ ధరల విషయంలో పెట్రోలు, డీజిల్ పద్ధతిని అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. అంటే ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుస్తున్నట్లే ఇక నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు మారుస్తారన్నమాట. కాగా, అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా పెట్రో రేట్లను ప్రతీ రోజూ సవరిస్తుండగా, గ్యాస్ ధరలను మాత్రం తొలి దశలో వారానికి ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ మార్చాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించింది.

గతేడాది(2020) డిసెంబర్ లో రెండుసార్లు గ్యాస్ ధరలను పెంచిన ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్‌పై ఏకంగా రూ.100 పెంచింది. ధర భారీగానే పెరిగినా ప్రజల నుంచి వ్యతిరేకత లేకపోవడంతో ఏప్రిల్ నుంచే రోజు వారీ ధరల సవరణ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, తొలి దశలో మాత్రం 15 రోజులకు ఒకసారి ధరలను సవరించనుండగా, ఆ తర్వాత వారానికి ఒకసారి సవరిస్తారు.

చివరిగా దానిని రోజువారీకి మారుస్తారు. అయితే, ఈ విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు ఒక ధర, డెలివరీ చేసేటప్పుడు ఒక ధర ఉంటుందని, కాబట్టి ఇబ్బందులు తప్పవని ఎల్పీజీ డీలర్ల సంఘం అంటోంది. ఈ విధానం ద్వారా గ్యాస్ పై నష్టాన్ని పూడ్చుకోవాలని కేంద్రం ఆలోచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలంలో గ్యాస్ సబ్సిడీ ప్రక్రియకు మంగళం పాడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో గ్యాస్ సబ్సిడీకి ఇచ్చే నిధుల కేటాయింపులను గణనీయంగా తగ్గించేసింది. రూ.12,995 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపులు రూ.40 వేల కోట్లకు పైమాటే. అంటే కేంద్రం సబ్సిడీ నిధులను కూడా తగ్గించేసిందని గుర్తించాలి. ఈ చర్య వల్ల కిరోసిన్, గ్యాస్ సబ్సిడీని భారీగా తగ్గించడం లేదా మొత్తం సబ్సిడీని ఎత్తేయడం జరుగుతుందని అధికారిక వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం గ్యాస్ సబ్సిడీ రూ.40 పడుతోంది.

గత ఏడాది(2020) మే నెల నుంచి అంటే, కరోనా సంక్షోభం మొదలైన తర్వాత నుంచి కేవలం 40 రూపాయల 72 పైసలు మాత్రమే సబ్సిడీగా పడుతోంది. అంతకు ముందు రూ.280 వరకు సబ్సిడీ మొత్తంగా పడేది. నిజానికి వంటగ్యాస్‌ సబ్సిడీ అనేది వేరియబుల్‌. అంటే, గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగిన కొద్దీ సబ్సిడీ మొత్తం పెరగాలి. మనం సిలిండర్‌ తెచ్చే బాయ్‌కు చెల్లించేది మాత్రం మార్కెట్‌ ధరే ఉంటుంది. నిజంగా అలాగే చెల్లిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ ధర పెంచినపుడల్లా పెరిగిన తేడా మొత్తం సబ్సిడీ రూపంలో మన ఖాతాలో పడుతుంది.

గత ఏడాది(2020) కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ మూలధర(బేస్‌ ప్రైస్‌)ను క్రమంగా రూ.700కు పెంచింది. అంటే, సిలిండర్‌ ధర రూ.700 మించి ఎంత ఉంటే అంత మొత్తం ప్రభుత్వం సబ్సిడీగా వినియోగదారుల ఖాతాలో వేస్తుందన్నమాట. దాంతో సామాన్యుడికి బ్యాంకు ఖాతాలో పడే సొమ్ము ఒక్కసారిగా రూ.280 నుంచి రూ.40కి తగ్గిపోయింది. ప్రజలంతా కరోనా భయంతో ఇల్లు కదలకుండా ఉన్న లాక్‌డౌన్‌ సమయంలో ఇదంతా జరిగిపోయింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.40.72 సబ్సిడీగా సామాన్యుడి బ్యాంకు ఖాతాలో వేసి చేతులు దులుపుకుంటోంది.

గత ఆరేళ్లలో సిలిండర్‌ రేటుతో పాటు సబ్సిడీ తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు కేవలం రూ.40 సబ్సిడీగా ఇస్తున్నారు. అది కూడా చమురు కంపెనీలే ఇస్తున్నట్లు సమాచారం. అంటే, కేంద్రం ఇస్తున్నది సున్నా. ఈ పరిణామాలన్నీ చూస్తే వంట గ్యాస్‌ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసినట్లేనని అంతా భావిస్తున్నారు. గ్యాస్‌ డీలర్లు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రభుత్వం ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.