రోడ్ షోలో ఆలస్యం…నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : January 20, 2020 / 04:35 PM IST
రోడ్ షోలో ఆలస్యం…నామినేషన్ వేయలేకపోయిన కేజ్రీవాల్

ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ తన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. సోమవారం నామినేషన్ దాఖలు చేయాలని ముందు నిర్ణయించిన కేజ్రీవాల్ 3గంటలలోపు ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రోడ్ షో కారణంగా ఆయన సకాలంలో ఎలక్షన్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు. ఓపెన్ టాప్ జీపుపై భార్య సునీతా కేజ్రీవాల్, ఇద్దరు పిల్లలు,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా,ఆప్ లీడర్ సంజయ్ సింగ్ తో కలిసి వాల్మీకి ఆలయం నుంచి కేజ్రీవాల్ రోడ్‌ షో ప్రారంభమైంది.

అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్ షో నెమ్మదిగా ముందుకు సాగింది. ఫలితంగా సకాలంలో కార్యాలయానికి చేరుకోలేకపోయారు.నామినేషన్ పేపర్లు దాఖలు చేయలేకపోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ…నేను నామినేషన్ వేయాలని రోడ్ షోలో మద్దతుదారులకు చెబుతూ ఉన్నాను. కానీ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ షోకు హాజరవడంతో నెమ్మదిగా సాగింది. నేను వాళ్లను వదిలి ఎలా వెళ్లగలను. రేపు ఉదయం నామినేషన్ ఫైల్ చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు రేపే నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. 

ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికలపై ఫుల్ సీరియస్ గా వర్క్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అయితే ఈ రేస్ లో వెనుకబడినట్లే చెప్పవచ్చు. ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కు నాయకత్వ లేమి గట్టిగా కన్పిస్తోంది.