Babri Masjid Demolition Verdict తీర్పుపై ఉత్కంఠ..అసలు ఏం జరిగింది

  • Published By: madhu ,Published On : September 30, 2020 / 06:39 AM IST
Babri Masjid Demolition Verdict తీర్పుపై ఉత్కంఠ..అసలు ఏం జరిగింది

Babri Masjid Demolition Verdict : బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తీర్పు లా అండ్ ఆర్డర్‌ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలపై సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది.



1992 డిసెంబర్ 6న కరసేవకులు… అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు. ఈ కేసు నత్తనడకన సాగడంతో దాదాపు 28 ఏళ్లు పట్టింది. ఈ కేసులో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని 2017, ఏప్రిల్‌ 19న సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈ కేసును విచారిస్తున్న జడ్జిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణ పూర్తి చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు 2020, సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం తీర్పును చెప్పబోతోంది.



1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఒక ఎఫ్‌ఐఆర్‌లో లక్ష మంది కరసేవకులపై కేసు నమోదైంది. రెండో కేసులో బీజేపీకి చెందిన అద్వానీ, జోషీ, ఉమా భారతి, వినయ్ కటియార్ సహా 8 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో వీహెచ్‌పీ నేత అశోక్‌ సింఘాల్, దాల్మియా, గిరిరాజ్ కిషోర్‌ చనిపోయారు. ఉమా భారతికి కరోనా పాజిటివ్‌గా రావడంతో… రుషికేష్ ఎయిమ్స్‌లో చేరారు. మిగతా వారు కోర్టుకు హాజరయ్యే ఛాన్సుంది.



బాబ్రీ మసీదు కూల్చివేత అంశంపై 47 FIRలు నమోదయ్యాయి. మొదట్లో కరసేవకులకు సంబంధించిన కేసును సీబీఐకి… నేతలకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించారు. ఆ తర్వాత 1993 ఆగస్టు 27న అన్ని కేసుల్నీ యూపీ ప్రభుత్వం సీబీఐ చేతిలో పెట్టింది. 1993 అక్టోబర్ 5న సీబీఐ… అద్వానీ, జోషి తదితర 8 మంది నేతలు సహా మొత్తం 40 మందిపై ఛార్జిషీట్ ఫైల్ చేసింది.



రెండేళ్ల దర్యాప్తు తర్వాత మరో చార్జిషీట్‌ని 1996 జనవరి 10న దాఖలు చేసింది. కుట్రపూరితంగానే బాబ్రీమసీదు కూల్చివేత జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత శివసేన నేతలు బాల్ థాక్రే మరో 9 మంది పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చింది. సీబీఐ 351 మంది సాక్షులను, 600 డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను కోర్టు ముందు ఉంచింది.



2001 ఫిబ్రవరి 12న అలహాబాద్ హైకోర్టు… అద్వానీ, జోషి, ఉమా భారతి, యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్, ఇతరులపై ఉన్న క్రిమినల్ కుట్ర అభియోగాలను కొట్టేసింది. అయితే 2017 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు… అద్వానితోపాటూ… మిగతా వారిపైనా నేరపూరిత కుట్ర కోణంలో విచారణ జరపాలని స్పష్టం చేసింది. సుమారు 40 వేల మందిని ప్రత్యక్ష సాక్షుల్ని సీబీఐ ప్రత్యేక కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది.



డిసెంబర్ 6,1992: బాబ్రీ మసీదు కూల్చివేత
డిసెంబర్ 6,1992: రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు
డిసెంబర్ 6,1992: మొదటి ఎఫ్‌ఐఆర్‌లో లక్షమంది కరసేవకులపై కేసు
డిసెంబర్ 6,1992: రెండో ఎఫ్‌ఐఆర్‌లో అద్వానీ, జోషి, సింఘాల్‌ తదితరులపై కేసు నమోదు



డిసెంబర్ 12, 1992: మసీదు కూల్చివేతపై విచారణకు లిబర్హన్ కమిషన్‌
1993: లిబర్హన్ కమిషన్‌ విచారణ ప్రారంభం
1993: బీజేపీ నేత ఎల్‌.కె. అద్వానీ సహా19 మందిపై సీబీఐ చార్జ్‌షీట్‌
1996: శివసేన చీఫ్‌ బాల్‌థాక్రే సహా 9 మందిపై సీబీఐ చార్జ్‌షీట్‌
1997: 48 మంది కుట్రకు పాల్పడ్డారన్న లక్నో స్పెషల్ కోర్టు



మే, 2001 : ఎల్‌.కె. అద్వానీ, ఎం.ఎం.జోషిలపై నేరపూరిత ఆరోపణలు తొలగింపు
జూన్‌, 2009: 68 మందిని దోషులుగా పేర్కొన్న లిబర్హన్‌ కమిషన్ నివేదిక
2011: రెండు వేర్వేరు కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ
2011: రెండు కేసుల్ని లక్నో ప్రత్యేక కోర్టులోనే విచారించాలన్న సుప్రీంకోర్టు
2015: అద్వానీ సహా బీజేపీ సీనియర్‌ నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు



మే 26, 2017: ఎల్‌.కె. అద్వానీతో సహా ఆరుగురు బీజేపీ నేతలకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు
జులై 24, 2020: వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అద్వానీ స్టేట్‌మెంట్‌ రికార్డ్