సరిహద్దులు దాటేందుకు వెనుకాడం…రాజ్ నాథ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 26, 2020 / 07:42 AM IST
సరిహద్దులు దాటేందుకు వెనుకాడం…రాజ్ నాథ్

ఉగ్రవాదాన్ని డీల్ చేయడంలో భారత్ పెద్ద మార్పు తీసుకుందని,ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించడంలో అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా సాయుధ బలగాలు వెనుకాడబోవని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించి నేటికి(ఫిబ్రవరి-26,2020) ఏడాది పూర్తైన సందర్భంగా ఇవాళ ఆయన ట్విటర్  వేదికగా స్పందించారు. 

బాలాకోట్ వైమానిక దాడులు జరిగి ఏడాది పూర్తి అయిన సందర్భంగా దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. శౌర్యవంతులైన IAF వీరులు చేపట్టిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్ ఇది. బాలాకోట్ ఆపరేషన్‌‌లో విజయం సాధించడం ద్వారా తీవ్రవాదులకు భారత్ గట్టి సందేశాన్ని ఇచ్చిందని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు బాలాకోట్ వైమానిక దాడుల కోసం అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ఆయన కొనియాడారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం గత ప్రభుత్వాలకంటే భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నదని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో సరికొత్త మార్పు తీసుకొచ్చిన మోడీకి రక్షణమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని, పోరాట పంథాని సమూలంగా మార్చిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. 2016 సర్జికల్ దాడులు, 2019 బాలాకోట్ వైమానిక దాడులు ఈ మార్పునకు స్పష్టమైన సంకేతాలని అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ లో తెలిపారు.