మూడో దశ ఎన్నికల ప్రచారనికి నేటితో తెర : ఏప్రిల్ 23 న పోలింగ్

  • Published By: chvmurthy ,Published On : April 21, 2019 / 06:07 AM IST
మూడో దశ ఎన్నికల ప్రచారనికి నేటితో తెర : ఏప్రిల్ 23 న పోలింగ్

ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్  23న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో గుజరాత్ లో 26, కేరళ లో 20, మహారాష్ట్ర 14, కర్ణాటక 14, ఉత్తర ప్రదేశ్ 10, చత్తీస్ ఘడ్ 7,  ఒడిషా 6, బీహార్ 5, వెస్ట్ బెంగాల్ 5, అస్సాం 4, గోవా 2, జమ్మూ కాశ్మీర్ 1, దాద్రా & నాగర్ హవేలి 1, త్రిపుర1, డయ్యూ డామన్ లలో1 నియోజక వర్గంలోనూ పోలింగ్ జరుగుతుంది. 

చివరి రోజు ప్రచారం చేయటానికి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సమాయత్తమయ్యాయి. ఈ పోలింగ్ లో పలువురు ప్రముఖుల పోటీలో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ కూడా  3వ దశ పోలింగ్ లో ఉంది. రాహుల్‌కి పోటీగా సీపీఐ నుంచీ పీపీ సునీర్, ఎన్టీయే తరపున తుషార్ వెల్లపల్లి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పోటీ చేస్తున్న తిరువనంతపురంలో కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. శశిథరూర్‌కి బీజేపీ అభ్యర్థి రాజశేఖరన్, లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి సి.దివాకరన్ గట్టి పోటీ ఇస్తున్నారు. శబరిమల వివాదం తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. రెండో దశలో దేశవ్యాప్తంగా 67 శాతమే పోలింగ్ జరగడంతో… మూడో దశలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి.
 
ఉత్తర ప్రదేశ్ నుంచి   కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్  మెయిన్ పురి నుంచి పోటీ చేస్తున్నారు. జయప్రద బీజేపీ  తరపున  రాంపూర్ నుంచి పోటీ చేస్తుండగా ఆమెకు ప్రత్యర్ధి ఎస్పీ నేత అజంఖాన్ బరిలో ఉన్నారు. ఫిలిబిత్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా వరుణ్ గాంధీ పోటీలో ఉన్నారు. 

గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బరిలో ఉన్నారు.  ఒడిషాలో  ఆరు లోక్ సభ స్దానాలకు , 42 అసెంబ్లీ స్ధానాలకు మూడో దశలో  పోలింగ్ జరుగుతుంది. ఆరు లోక్ సభ స్ధానాలకు 61 మంది  అభ్యర్ధులు..అసెంబ్లీ ఎన్నికలకు 356 మంది అభ్యర్ధులుపోటీలో ఉన్నారు. మహారాష్ట్రలో 3వ దశలో 14 స్ధానాలకు పోలింగ్ జరుగుతుండగా 245 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 

కర్ణాటకలో 14 స్ధానాల్లో పోలింగ్ జరగుతుండగా బీజేపీ 14 స్ధానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 11, జేడీఎస్ 3 స్ధానాల్లో బరిలో ఉన్నాయి.  జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ నియోజక వర్గంలోని ఓ జిల్లాలో  బ్యాలెట్ విధానం లో ఎన్నికలు జరగనున్నాయి.  రెండో దశలో వాయిదా వేసిన త్రిపు ఈస్ట్,తమిళనాడులోని వేలూరు నియోజకవర్గానికి 3వ దశలో పోలింగ్ జరుగుతుంది.