చంద్రయాన్‌-2 ఖర్చు ఎంతో చెప్పిన కేంద్ర ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : November 21, 2019 / 08:16 AM IST
చంద్రయాన్‌-2 ఖర్చు ఎంతో చెప్పిన కేంద్ర ప్రభుత్వం

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 గురించి లోక్ సభలో చర్చించారు సభ్యులు. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా చంద్రయాన్‌-ఖర్చు, తయారీ వివరాలు చెప్పాలంటూ ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సమాధానం ఇచ్చారు.

ఈ ఏడాది జులై 22వ తేదీన దేశంలోని ప్రతి వ్యక్తి గర్వపడేలా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 GSLV MK III-M1 వాహక నౌక ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు పేరు తెచ్చిపెట్టిందని వివరించిన మంత్రి, చంద్రయాన్ -2 ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై కఠినంగా ల్యాండింగ్ కావడంతో విఫలం అయ్యిందని చెప్పారు. నిర్ణయించిన పరిమితుల కంటే వేగాన్ని తగ్గించకపోవడమే విఫలం అవ్వడానికి కారణం అని ఆయన వివరించారు. చంద్రునిపై 500 మీటర్ల ఎత్తు నుంచి గట్టిగా ల్యాండింగ్ అవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

ప్రయోగం విఫలం అయినా కూడా ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని అన్నారు జితేంద్ర సింగ్. మన దేశ ఔన్నత్యాన్ని పెంచే విధంగా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయినట్లుగా జితేంద్ర సింగ్‌ వివరించారు.