ఎలక్షన్ ఇయర్ : పార్టీలన్నీ రైతు జపం..

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 07:01 AM IST
ఎలక్షన్ ఇయర్  : పార్టీలన్నీ రైతు జపం..

ఢిల్లీ :  2019ని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవాలి. 2018లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాయి. తమ గెలుపు కోసం పార్టీలన్నీ రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించేశాయి. ఈ రేసులో రైతులకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలను రూపొందించేందుకు పోటీ పడుతున్నాయి. 
కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే.. రైతులకోసం ఏదైనా చేయాల్సిన అనివార్య పరిస్థితులపై బీజేపీ భారీ కసరత్తులు చేస్తోంది. కాకపోతే అది ఎటువంటి సంక్షేమం అనే విషయంపై కమలనాధులు మల్లగుల్లాలు పడతున్నారు. రైతు రుణమాఫీనా? మరేదైనానా అనే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయా రాష్ట్రాల్లో రైతులకు పంటరుణాల మాఫీ చేసింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అప్పుడే  రైతుల నుండి మంచి అభిప్రాయాన్నికొట్టేసింది. మొదట ఈ రుణమాఫీపై విమర్శలు చేసిన బీజేపీ కూడా లోక్ సభ ఎన్నికల విషయంలో అదే తీరుగా ఆలోచిస్తుండటంతో రైతు ఓటు పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు రైతుల కోసం భారీ నజరానాలు ప్రకటిస్తున్నాయి. 

ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా..తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం సెంటిమెంట్ తో భారీ విజయాన్ని సాధించిన క్రమంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం  మమతాబెనర్జీ…కిసాన్ బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు ఏడాది చొప్పున రూ. 5వేల పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు రైతు మరణిస్తే 2లక్షల భీమా ఇవ్వాలని బెంగాల్ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఈ తరహా పథకాలను అమలు చేస్తున్నాయి.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. 18 నుంచి 59 మధ్య వయస్కులైన రైతులు చనిపోతే.. రైతుభీమా ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు భీమా, రైతు బంధు పథకాలను ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు కూడా ప్రకటించి అమలులోకి తీసుకొచ్చాయి. దీంతో ఏపార్టీ అయినా రైతు సెంటిమెంట్ తో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రైతే దిక్కు అన్నట్లుగా అన్ని పార్టీలు రైతు ఎజెండాను తమ మానిఫెస్టోలో చేరుకుని అధికారంలోకి వచ్చేందుకు రైతు జపం చేస్తున్నాయి.