7 రోజుల్లో ల‌క్షా 60వేల కేసులు, 3వేల 242 మ‌ర‌ణాలు..భారత్‌లో కరోనా కల్లోలం

  • Published By: naveen ,Published On : July 8, 2020 / 10:49 AM IST
7 రోజుల్లో ల‌క్షా 60వేల కేసులు, 3వేల 242 మ‌ర‌ణాలు..భారత్‌లో కరోనా కల్లోలం

భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 6వ రోజు(జూలై 8,2020) కూడా దేశంలో 20వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 22వేల 752 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. మరో 482 మంది మ‌ర‌ణించారు. దేశ‌వ్యాప్తంగా బుధవారం(జూలై 8,2020) నాటికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షల 42వేల 417కి చేరింది. ఇప్పటివరకు కరోనాకు బలైన వారి సంఖ్య 20వేల 642కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో రిక‌వ‌రీ రేటు 61 శాతంగా ఉంది. కాగా, జూలై తొలి వారం రోజుల్లోనే దేశంలో ల‌క్షా 60వేల కేసులు, 3వేల 242 మ‌ర‌ణాలు సంభ‌వించడం ఆందోళన కలిగిస్తోంది.

రిక‌వ‌రీ రేటు 61.13శాతం:
దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ప్ప‌టికీ కోలుకుంటున్న‌వారి సంఖ్య కూడా పెరుగుతుండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 61.13శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌రకు 4లక్షల 56వేల 831 మంది కోలుకున్నారు. 2లక్షల 64వేల 944 యాక్టివ్ కేసులు ఉన్న‌ాయి. ప్ర‌పంచ‌ దేశాల‌తో పోలిస్తే ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందికి న‌మోదవుతున్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భార‌త్‌లోనే త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తెలిపింది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచ స‌గ‌టు 1453.25 (ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందికి) ఉండ‌గా, భార‌త్‌లో మాత్రం 505.37గా ఉన్న‌ట్లు తెలిపింది. మ‌ర‌ణాల సంఖ్య ప్ర‌పంచ స‌గ‌టు 68.29(ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందికి)కాగా భార‌త్‌లో మాత్రం 14.27గా ఉంది. మరోవైపు, ప్ర‌పంచంలో అత్య‌ధిక కరోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల జాబితాలో భార‌త్ మూడో స్థానంలో ఉండ‌గా, మ‌ర‌ణాల్లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది.

కరోనా మరణాల్లో చైనాను దాటేసిన ముంబై:
బుధవారం మహారాష్ట్ర (5,134), తమిళనాడు (3,616), ఢిల్లీ (2,008)లో కేసుల సంఖ్య కాస్త తక్కువగా నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్ (1,346), గుజరాత్ (778), రాజస్థాన్ (716), ఒడిశా (571)లో మాత్రం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం గమనార్హం. బుధవారం దేశవ్యాప్తంగా 482 మంది ప్రాణాలు కోల్పోగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 224 మంది చనిపోయారు. ఒక్క ముంబై నగరంలోనే 64 మంది బలయ్యారు. ముంబై కరోనా మరణాల సంఖ్య 5వేలు దాటింది. దీంతో, కరోనా మరణాల్లో చైనాను దాటేసింది ముంబై. చైనాలో ఇప్పటివరకు 4వేల 634 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం బెంగళూరులో 800కిపైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వీరవిహారం:
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఏపీలో కొత్తగా 1,178.. తెలంగాణలో 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 1,422 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

Read Here>>డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కోవిడ్ పరీక్షలకు అనుమతి