MM Naravane : భారత్-పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ కోసం భారత్-పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి-25న కుదిరిన శాంతి ఒప్పందానికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కశ్మీర్ లో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్..వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

MM Naravane : భారత్-పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Mm Naravane

MM Naravane వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ కోసం భారత్-పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి-25న కుదిరిన శాంతి ఒప్పందానికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కశ్మీర్ లో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్..వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఎలోవోసీ వద్ద భద్రత పరిస్థితులపై ఆర్మీ చీఫ్ సమీక్షించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేయడానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక కమాండర్లు ఆయనకు వివరించారు. ఆయన సైనికులతో మాట్లాడారు. కార్యకలాపాలకు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నందుకు సైనికులను ప్రశంసించారు.

రెండు రోజుల కశ్మీర్ పర్యటనపై గురువారం విలేఖరులతో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య దశాబ్దాల నుంచి కొనసాగుతున్న అపనమ్మకం, అనుమానం కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రికి రాత్రే పరిస్థితిలో మార్పులు రావు అన్నారు. కానీ పాకిస్తాన్​ ఈ కాల్పుల విరమణను కొనసాగిస్తే,మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం మానుకుంటే అప్పుడు ఆ దేశం మీద నమ్మకం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయని నరవాణే అన్నారు. గత 100 రోజులుగా కాల్పులకు తెగబడని పాక్​ను నమ్మవచ్చా అనే ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. నమ్మకాన్ని పెంచుకోవలసిన బాధ్యత పూర్తిగా పాకిస్తాన్‌ పైనే ఉందన్నారు.

కాల్పుల విరమణను ఇరు దేశాల సైన్యాలు పాటిస్తుండటం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భద్రత విషయంలో మంచి పరిణామమని తెలిపారు. ఒప్పందానికి పాక్​ కట్టుబడి ఉన్నంత కాలం భారత్​ కాల్పుల విరమణను కొనసాగిస్తుందని సృష్టం చేశారు. అయితే సైన్యం అప్రమత్తంగానే ఉంటుందని.. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగడమే అందుకు కారణమని స్పష్టం చేశారు. భారత దేశంతో సంత్సంబంధాలను కోరుకుంటే ముందుగా ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పాకిస్తాన్ నాశనం చేయాలని చెప్పారు.

నియంత్రణ రేఖ వద్ద, కశ్మీర్​లోనూ పరిస్థితి మెరుగైందని ఆర్మీ చీఫ్ తెలిపారు. స్థానిక యువత హింసను మానుకోవాలని పిలుపునిచ్చారు. దాని వల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఇక, అమర్​నాథ్​ యాత్రకు సైన్యం అన్ని ఏర్పాట్లు చేసిందని.. అయితే యాత్ర నిర్వహణపై తుది నిర్ణయం జమ్ము కశ్మీర్​ యంత్రాంగానిదే అని నరవాణే అన్నారు.