మాయావతి@63 : బీజేపీకి రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 10:00 AM IST
మాయావతి@63 : బీజేపీకి రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు

బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే అక్రమగనుల తవ్వకాల కేసులో అఖిలేష్ పై సీబీఐ విచారణ అని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. మంగళవారం(జనవరి 15,2019) మాయావతి 63వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అఖిలేష్ పై బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోందని, అఖిలేష్ ఎటువంటి తప్పు చేయలేదని ఆమె అన్నారు. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

చిరకాల ప్రత్యర్థి ఎస్పీతో విభేధాలను పక్కనబెట్టి, రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం  ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకోవడమే ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలకు తాను ఇచ్చే గిఫ్ట్ అని ఆమె అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ, కాబోయే ప్రధాని ఎవరన్నది ఉత్తరప్రదేశ్ నిర్ణయిస్తుందని ఆమె తెలిపారు. అఖిలేష్ కూడా మాయావతి ప్రధాని అయ్యేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇప్పటికే చెప్పారు. మంగళవారం లక్నోలోని మాయావతి నివాసానికి వెళ్లిన అఖిలేష్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ నాయకులకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని మాయావతి అన్నారు. స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా తాము జట్టు కట్టామని చెప్పారు. భారీ ర్యాలీలు, పెద్ద పెద్ద హామీలివ్వడం మినహా ప్రధాని నరేంద్ర మోడీ వాటిని నిలబెట్టుకోరని ఆమె తెలిపారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీతో పాటు కాంగ్రెస్ కు కూడా ఓ గుణపాఠమని అన్నారు. మూడు రాష్ట్రాల్లో రైతులకు కాంగ్రెస్ అమలు చేసిన రుణమాఫీ ఏ మాత్రం సరిపోదన్నారు. రైతు ఆత్మహత్యలు ఆగేవరకు వారికి 100శాతం రుణాలు మీఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పేదలు,బడుగు వర్గాల సంక్షేమానికి బీఎస్పీ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందని, తన జీవితం ప్రజలకే అంకితమని ఆమె తెలిపారు.