ఢిల్లీ గాలే చంపేస్తుంది…ఇంక ఉరి దేనికి : సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2019 / 11:30 AM IST
ఢిల్లీ గాలే చంపేస్తుంది…ఇంక ఉరి దేనికి : సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్

ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ సుప్రీంకోర్టుని కోరుతూ పెట్టుకున్న పిటిషన్ లో ఈ వాదనలు చేశాడు.

ఢిల్లీలో దీపావళి తర్వాతి రోజు నుంచి తీవ్ర వాయుకాలుష్యం నెలకొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ,దాని పరిసర ప్రాంతాలంలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఢిల్లీ,దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని నీళ్లు కూడా మొత్తం విషవాయువులతో నిండిపోయాయని,నీళ్లు,గాలికి సంబంధించి ఢిల్లీ,దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసునని,జీవితం రోజురోజుకీ తగ్గిపోతుందని,ఈ సమయంలో తమకు ఉరి శిక్ష ఎందుకని నిందితుడు అక్షయ్ పిటిషన్ లో తెలిపాడు.

మరోవైపు నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితులను డిసెంబర్-16,2019న ఉరితీయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డిసెంబర్ 14లోగా 10 పీసుల ఉరితాళ్లను సిద్దం చేయాలని బీహార్ లోని బక్సర్ జైలుకు ప్రిజన్ డైరక్టరేట్ ఆదేశాలిచ్చింది. ఈ ఉరితాళ్లు నిర్భయ కేసులోని దోషుల కోసమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.