భార‌త్‌లో ‌కరోనా సెకండ్ వేవ్ మొద‌లైందా..? దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా?

భార‌త్‌లో ‌కరోనా సెకండ్ వేవ్ మొద‌లైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేత‌మా..? లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంది.

భార‌త్‌లో ‌కరోనా సెకండ్ వేవ్ మొద‌లైందా..? దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ తప్పదా?

Lockdown India

Did the second wave of Corona start in India ? : భార‌త్‌లో ‌కరోనా సెకండ్ వేవ్ మొద‌లైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేత‌మా..? లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంది. దేశంలో కరోనా దూకుడు పెంచింది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫిబ్రవరి 11న 10 వేల కేసుల నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలు దాటేసింది. అంటే నెల రోజుల వ్యవధిలోనే రెండురెట్లు అధికంగా కేసులు రికార్డయ్యాయి.

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చి ఏడాది గడిచిపోయింది. ఆ మహమ్మారి కట్టడిలో ఎన్నెన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్నాం. లైఫ్‌ మామూలు అయిపోయింది. కానీ, చిన్న నిర్లక్ష్యం మళ్లీ మన వాకిట్లోకి కరోనాను తీసుకొస్తోంది. వ్యాక్సిన్లు వచ్చేశాయన్న భరోసా కావొచ్చు.. బతుకు బండి నడవాలంటే రిస్క్ చేయక తప్పదన్న ఆలోచనా కావొచ్చు.. చాలా మంది కరోనా గురించి పట్టించుకోవట్లేదు. కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు. సోషల్​డిస్టెన్స్ సంగతి దేవుడెరుగు.. ఎక్కడికక్కడ జనాలు గుమిగూడుతున్నారు. ఆడంబరంగా ఫంక్షన్లు చేసుకుంటున్నారు. వాటికి తోడు ఎన్నికలు. దీంతో కరోనా గేర్లు మార్చి జోరందుకుంటోంది. కేసులు తగ్గుతున్నాయని సంబరపడే లోపే మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌ కర్నాటక రాష్ట్రాల్లో మహమ్మారి ప్రభావం ఎక్కువవుతోంది.

అమెరికా, రష్యా, ఇటలీ దేశాల్లో కూడా ఇండియాలోలాగే కేసులు ఆకస్మాత్తుగా తగ్గిపోయి… మళ్లీ 3 నుంచి 5 నెలల వ్యవధి మధ్యలో సెకండ్‌ వేవ్‌ స్టార్ట్‌ అయింది. భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మహా దారుణంగా కరోనా వ్యాపిస్తోంది. నిన్నే దేశవ్యాప్తంగా 22 వేల 854 మందికి కరోనా నిర్ధారణ అయింది. 77 రోజుల ముందు డిసెంబరు 25న 23 వేల 67 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఈ రేంజ్‌లో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే కొత్త కేసుల్లో 13 వేల 659 కేసులు మహారాష్ట్రవే. దేశంలో యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో 8 మహారాష్ట్రలోనివే ఉన్నాయి. గత ఏడు రోజుల సగటు చూస్తే మహారాష్ట్రాలో 331శాతం మేర కేసుల పెరుగుదల కనిపించింది

ఇక దేశంలో ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, కేరళలో పరిస్థితి చేయిదాటిపోయింది. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 85శాతం కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కరోనా ప్రకోపానికి పంజాబ్‌ బలైపోతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా అక్కడ రైతులు ఆందోళనలు చేస్తుండడం కూడా కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. గత జనవరిలో రోజుకు సగటున 181 కేసుల చొప్పున పంజాబ్‌లో రికార్డవ్వగా ఇప్పుడు ఆ సంఖ్య వేలకు చేరుకుంది.

ఫిబ్రవరి మొదటి వారంలో నెమ్మదిగా పెరిగిన పాజిటివ్‌ కేసులు.. మార్చి నాటికి ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడు రోజుల సగటు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రల కంటే ఎక్కువగా 509శాతం కేసులు పంజాబ్‌లో రికార్డయ్యాయి. ఇక ఢిల్లీలోనూ కొత్తగా 409 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రెండు నెలల తర్వాత ఒకే రోజున ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ట్రెండ్‌ చూస్తుంటే భారత్‌కి భారీ ముప్పు పొంచి ఉందని అర్ధమవుతోంది. వచ్చే 2 నెలల్లో కరోనా విశ్వరూపం తప్పదని తెలుస్తోంది.