జీడీపీ వృద్ధి రేటు 11శాతం..V షేష్డ్ రికవరీ

జీడీపీ వృద్ధి రేటు 11శాతం..V షేష్డ్ రికవరీ

Economic Survey బ‌డ్జెట్ స‌మావేశాల మొదటిరోజైన శుక్రవారం(జనవరి-29,2021) రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌సంగం త‌ర్వాత లోక్‌స‌భ స‌మావేశ‌మైంది. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఎంపీల‌కు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. అనంత‌రం సభ జరుగుతోన్న సమయంలో విప‌క్ష ఎంపీలు.. వ్యవసాయ చట్టాలపై చర్చను కోరుతూ ఆందోళనకు దిగాయి. విప‌క్ష స‌భ్యుల నినాదాల మ‌ధ్యే కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ .. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే 2020-21ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుంద‌ని ఈ ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆర్థిక స‌ర్వే ఈ అంచ‌నాకు వ‌చ్చింది. అదే సమయంలో సమయంలో ద్రవ్యోల్బణం 15.4 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. స్వాతంత్ర్యం తర్వాత ఇదే అత్యధిక ద్రవ్యోల్బణమని పేర్కొన్నారు

ఇక 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు -7.7 శాతంగా ఉంటుంద‌ని కూడా తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని V(వేగంగా పడి, వేగంగా లేచిన) షేప్డ్ రిక‌వ‌రీగా ఉంటుంద‌ని కూడా ఆర్థిక సర్వే అంచ‌నా వేసింది. అయితే క‌రోనా మునుప‌టి జీడీపీ స్థాయిల‌కు చేరుకోవ‌డానికి మ‌రో రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని సర్వే స్ప‌ష్టం చేసింది. గ‌తేడాది కొవిడ్ కార‌ణంగా ఒక్క వ్య‌వ‌సాయ రంగం త‌ప్ప మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవ‌లు, త‌యారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది. ఈ ఏడాది ప్ర‌భుత్వం త‌న 3.5 శాతం ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌చ్చ‌ని కూడా ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది.

కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు గతేడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ అని తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మల ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా విప‌క్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగా, స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. ఫిబ్ర‌వ‌రి-1న ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌ళ్లీ స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే రోజు నిర్మల కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.