ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

  • Published By: naveen ,Published On : August 1, 2020 / 09:16 AM IST
ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి చేస్తోంది.



24 గంటల్లో 55వేలకు పైగా కొత్త కేసులు, 779 మరణాలు:
భారత్ లో ఒక్కరోజులో 55 వేలకుపైగా కొత్త కేసులొచ్చాయి. 779 మంది మరణించారు. అదే సమయంలో 37వేల 223 మంది కోలుకున్నారు. 6లక్షల 42వేల 588 పరీక్షలు నిర్వహించారు. ఈ అన్ని విషయాల్లోనూ ఇవే గరిష్ఠ రికార్డులు. 50వేలకుపైగా కేసులు నమోదు కావడం వరుసగా ఇది రెండోరోజు. కేవలం రెండు రోజుల్లో 15 లక్షల కేసులు 16 లక్షలకు చేరడం ఆందోళనకు గురి చేస్తోంది. గత 8 రోజులుగా రోజుకు 700కిపైగా సంభవిస్తున్న మరణాలతో దేశంలో మృతుల సంఖ్య 35వేల 747కి చేరింది. కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ప్రపంచంలో 5వ స్థానానికి ఎగబాకింది. కరోనా మరణాల సంఖ్యలో ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్‌, బ్రిటన్‌, మెక్సికోలు భారత్‌కంటే ముందున్నాయి.



ఒక్క జూలై నెలలోనే 60శాతం కరోనా కేసులు, 50శాతం మరణాలు:
కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం దేశంలో 10.58 లక్షలమందికిపైగా కోలుకున్నారు. దాంతో రికవరీ రేటు 64.54%కి చేరింది. మహారాష్ట్రలో తొలిసారి రోజువారీ కేసులు 11వేలను అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండోరోజు పదివేలకుపైగా కేసులొచ్చాయి. ఇప్పటివరకు 60శాతం కేసులు, 50శాతం మరణాలు జులైలోనే నమోదయ్యాయి. కర్ణాటకలోనూ తొలిసారి కేసులు 6వేల మార్క్‌ను దాటాయి. అసోంలో ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా 2,112 కొత్త కేసులొచ్చాయి. కాగా, శనివారం(ఆగస్టు 1,2020) నుంచి అన్‌లాక్‌-3 మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ తొలిగిపోనుంది.

ఢిల్లీలో హోటళ్లు, వారపు సంతలు తెరిచేందుకు గవర్నర్‌ నో:
ఢిల్లీలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువ ఉంటోంది. రికవరీ రేటు దాదాపు 90%కి చేరింది. మరోవైపు అన్‌లాక్‌-3 సందర్భంగా హోటళ్లు, వారపు సంతలు తెరవాలన్న నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తిరస్కరించారు. వీటికి అనుమతి ఇవ్వాలని గురువారం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయించగా, బైజాల్‌ అందుకు అంగీకరించలేదు.



కేసుల సంఖ్యలో ఢిల్లీని దాటేయనున్న ఏపీ:
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజులో 57 మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. పశ్చిమబెంగాల్‌లో 46, జమ్మూకశ్మీర్‌లో 17 మరణాలు సంభవించడం కూడా ఇప్పటివరకు గరిష్ఠమే. మణిపుర్‌లో తొలిసారిగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ కోటి 88లక్షల 32వేల 970 పరీక్షలు జరిగాయి. అందులో 8.70%మందికి పాజిటివ్‌గా వచ్చింది. రోజువారీ లెక్కలతో పోలిస్తే తమిళనాడులో కేసులు తగ్గినా మరణాలు పెరిగాయి. కేసుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌.. ఢిల్లీ కంటే కేవలం 3,846మేర వెనుకబడి ఉంది. ప్రస్తుతం భారత్‌లో కేసుల రోజువారీ వృద్ధిరేటు 3.5% మేర ఉంది. ఇది అమెరికా వృద్ధి రేటు 1.6%కంటే రెట్టింపు. బ్రెజిల్‌ వృద్ధి రేటు 2.3%కంటే చాలా ఎక్కువ.