కంగనాVS మహారాష్ట్ర గవెర్నమెంట్….ముంబైను POKతో పోల్చడంపై ఆగ్రహం

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2020 / 08:33 PM IST
కంగనాVS మహారాష్ట్ర గవెర్నమెంట్….ముంబైను POKతో పోల్చడంపై ఆగ్రహం

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరుపై కంగనా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. .దీంతో శివసేన ఎంసీ సంజయ్ రౌత్.. తమ అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడ్డారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే.. ముంబై మహానగరంలో అడుగుపెట్టొందంటూ అధికార పత్రిక సామ్నాలో రాసారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై కంగనా మండిపడింది. ముంబైలో అడుగుపెట్టవద్దని సంజయ్ రౌత్ నాకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు. ఈయన వ్యాఖ్యలు చూస్తుంటే.. ముంబై మహానగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ను తలపిస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది.

కంగనా వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు.  కంగనాను ఒక మెంటల్‌ పేషెంట్ ‌తో పోల్చారు. తను.. తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం.. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నాయని రౌత్‌ వ్యాఖ్యానించారు. తాము ఎవరినీ బెదిరించబోము…ముంబై నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదు..ముంబై, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము సహించమని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

26/11 దాడుల సమయంలో ముంబై పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పౌరులను కాపాడారని, 1992 ముంబై పేలుళ్లలోనూ నగరాన్ని, నగర ప్రజలను వారు కాపాడారని కొనియాడారు. కరోనా వైరస్‌తో పలువురు ముంబై పోలీసులు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, రోగుల సేవలో పలు త్యాగాలు చేస్తున్నారని సంజయ్‌ రౌత్ తెలిపారు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సైతం కంగనా తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చెడు అభిప్రాయముంటే కంగనా ముంబైకి రావొద్దు అన్నారు.

అయితే, ప్రభుత్వ నుంచి పార్టీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినా కంగనా ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యాఖ్యలపై కంగనా ఎదురుదాడికి దిగారు. అతన్ని తాలిబన్‌తో పోలుతూ వివాదాన్ని తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టారు. అంతేకాకుండా ‘ఈ నెల 9న ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి. నన్ను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తా’ అంటూ సవాల్‌ విసిరారు.