Mehul Choksi : చోక్సీకి బీపీ పెరిగింది..భారత్ కు అప్పగింతలో ఆలస్యం!

పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది.

Mehul Choksi : చోక్సీకి బీపీ పెరిగింది..భారత్ కు అప్పగింతలో ఆలస్యం!

Mehul Choksi

Mehul Choksi పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది. భారత్‌కు రాకుండా ఉండేందుకు చోక్సీ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. మే 23న చోక్సీ..డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించారంటూ అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసుపై స్థానిక న్యాయస్థానం సోమవారం విచారణ జరపాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలను పేర్కొంటూ కోర్టుకు చోక్సీ హాజరుకాలేదు.

మెహుల్ చోక్సీ మానసిక ఒత్తిడిలో ఉన్నారని ఆయన తరపు న్యాయవాదులు డొమినికాలోని రొసీయూ మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. అధిక రక్తపోటు, తీవ్ర మానసిక ఒత్తిడితో చోక్సీ బాధపడుతున్నారంటూ ఆయన ట్రీట్మెంట్ పొందుతున్న డొమినికా చైనా ఫ్రెండ్‌షిప్‌ హాస్పిటల్ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ను చోక్సీ తరపు న్యాయవాదులు కోర్టుకు అందజేశారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జూన్‌ 25వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా చోక్సీని పోలీసుల పర్యవేక్షణలో హాస్పిటల్ లోనే ఉంచాలని ఆదేశించింది. అయితే తదుపరి రిమాండ్‌ కోసం జూన్‌ 17న చోక్సీ కోర్టు ఎదుట హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో చోక్సీ అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది. అయితే భారత్‌కు వెళ్లకుండా ఉండేందుకే చోక్సీ బృందం ఈ వ్యూహాలు అమలు చేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు, చోక్సీని బలవంతంగా ఆంటిగ్వా నుంచి డొమినికా తీసుకొచ్చారని మొదటినుంచి ఆరోపిస్తున్న ఆయన న్యాయవాదులు.. దీనిపై తమవద్ద సాక్షాలున్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను డొమినికాలోని ఆయన న్యాయవాది మైఖెల్‌ పొలాక్‌ సోమవారం విడుదల చేశారు. మొదట ఛోక్సీని చిన్న బోటులో ఎక్కించారని, అక్కడ ఆయనపై దాడి చేసి తర్వాత పెద్ద బోటులో ఎక్కించి డొమినికా తీసుకొచ్చారని మైఖెల్‌ ఆరోపించారు.