చీరకట్టి క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్

  • Published By: chvmurthy ,Published On : March 5, 2020 / 05:54 PM IST
చీరకట్టి  క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్

మహిళా క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సుదీర్ఘ కాలం భారత మహిళల క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. ఎందరో మహిళా క్రీడాకారులకు  ఆమె స్ఫూర్తిగా మారారు. 

అలాంటి మిథాలీ రాజ్  తొలిసారిగా భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన వేళ సిటీ గ్రూప్‌తో కలిసి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. ఆ వీడియోలో మిథాలీ చీరకట్టులో క్రికెట్‌ ఆడుతూ కనిపిస్తారు. అందులో మిథాలీ అచీవ్‌మెంట్స్‌ను కూడా పేర్కొన్నారు. ఈ వీడియోను మిథాలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్‌ ఆడారు. ‘కమాన్‌ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు మిథాలీని చూస్తే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజునే(మార్చి 8) టీమిండియా ఆసీస్‌తో ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్‌ వరకే పరిమితమైన భారత మహిళలు.. ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు. ఈ రోజు ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్‌-ఎలో అజేయంగా నిలిచిన భారత్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకుంది.