సీఎంలతో మోడీ : మాస్క్ లు ధరించి వీడియో కాన్ఫరెన్స్ 

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 06:57 AM IST
సీఎంలతో మోడీ : మాస్క్ లు ధరించి వీడియో కాన్ఫరెన్స్ 

లాక్‌డౌన్‌పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంల అభిప్రాయాలు, సూచనలను మోదీ తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాస్క్ లు ధరించి పాల్గొనడం విశేషం. 

ఈ సమావేశం అనంతరమే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ఆయన పూర్తి చేశారు. మరోవైపు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పొడిగింపునకు మద్దతు తెలిపాయి. ఈ  నేపథ్యంలో తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చని తెలుస్తోంది.

పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…ఏప్రిల్‌ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒడిశా ఒకడుగు ముందుకేసి ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా. పంజాబ్‌ కూడా కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్‌డౌన్‌ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు. మరోవైపు  దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను కోరింది.

ఏప్రిల్‌ 14 తరువాత మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో హోంశాఖ ఈ సమాచారం కోరింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలన్న సూచనలు ఎక్కువగా  రాష్ట్రాల నుంచి ఉన్నాయని తెలిసింది. లాక్‌డౌన్‌ సందర్భంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంతోపాటు అత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీస్, మీడియా, బ్యాంకులు పనిచేస్తాయని చెప్పింది.   

సీఎంలతో సమావేశానంతరం ప్రధాని మోదీ మరోసారి జాతి ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగ‌ళ‌వారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగియ‌నున్న నేపథ్యంలో మ‌ళ్లీ ఆయ‌న కీల‌క ప్రక‌ట‌న చేయ‌నున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ప్రస్తుత లాక్‌డౌన్‌లో కొన్ని మార్పులు చేసే అవ‌కాశాముందన్న టాక్ వినిపిస్తోంది. అంత‌ర్‌రాష్ట్ర ర‌వాణా మాత్రం పూర్తిగా నిలిపివేయ‌నుండగా…  కేవ‌లం నిత్యావ‌స‌రాల కోస‌మే వాహ‌నాల‌కు అనుమ‌తి ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, మందిరాల‌న్నీ మూసివేస్తారు. కొన్ని కంపెనీల‌కు స‌డ‌లింపు ఇచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మొత్తంగా మోడీ ఇవాళ ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Also Read | రికవరీ రేటు ఎక్కువగాఉన్న కేరళలో, మూడో కరోనా మరణం