పాకిస్తాన్ ఛానెల్‌ హ్యాకింగ్: డాన్ స్క్రీన్‌పై మూడు రంగుల భారత జెండా

  • Published By: vamsi ,Published On : August 3, 2020 / 07:53 AM IST
పాకిస్తాన్ ఛానెల్‌ హ్యాకింగ్: డాన్ స్క్రీన్‌పై మూడు రంగుల భారత జెండా

పాకిస్తాన్‌కు చెందిన అతిపెద్ద న్యూస్ ఛానల్ డాన్‌ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా ఆ వార్తాసంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలలో భారతీయ త్రివర్ణపతాకం మరియు స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఛానల్ తెరపై కనిపించింది.



పాకిస్తాన్ ప్రధాన టీవీ న్యూస్ ఛానల్ డాన్‌లో అకస్మాత్తుగా త్రివర్ణ పతాకం కనపడడంతో అక్కడి ప్రజలు కంగారుపడ్డారు. ఈ న్యూస్ ఛానల్‌పై హ్యాకర్లు దాడి చేశారని తరువాత తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పాకిస్తాన్ డాన్ న్యూస్ ఛానెల్‌లో ప్రకటన ప్రసారం అవుతున్న సమయంలో, అకస్మాత్తుగా త్రివర్ణ పతాకం టెలివిజన్ తెరపై ఎగురుతూ కనిపించింది. దీనిపై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా రాశారు.



అయితే అకస్మాత్తుగా భారత జెండా మరియు హ్యాపీ ఇండిపెండెన్స్ డే టెక్స్ట్ స్క్రీన్‌పై కనిపించడంతో.. వెంటనే అలర్ట్ అయిన ఆ ఛానెల్ టెక్నికల్ సిబ్బంది దానిని తొలగించారు అని ఛానెల్ ప్రకటించింది. ఈ వీడియో ఛానెల్‌లో ఎంతకాలం ప్రసారం చేయబడిందో ఇంకా చెప్పలేదు. ఇదిలావుండగా, ఈ కేసుపై తక్షణ దర్యాప్తునకు డాన్ సంస్థ ఆదేశించినట్లు డాన్ న్యూస్ ఉర్దూలో ట్వీట్ చేసింది. పాకిస్తాన్ మీడియా ప్రకారం, ఈ హ్యాకింగ్ వెనుక భారత హ్యాకర్లు ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు.