రైలు ప్రయాణికులకు బిగ్ షాక్, టికెట్ల ధరలు భారీగా పెంపు

రైలు ప్రయాణికులకు బిగ్ షాక్, టికెట్ల ధరలు భారీగా పెంపు

Platform ticket price raised: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ భారీ షాక్ ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ల ధరను భారీగా పెంచింది. ప్రస్తుతం స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా దాన్ని ఏకంగా రూ.30కి పెంచింది. అంతేకాదు.. లోకల్ రైళ్ల టికెట్ల ధరను కూడా పెంచింది. లోక‌ల్ రైళ్ల‌లో క‌నీస ఛార్జీ రూ.10గా ఉండగా.. దాన్ని రూ.30గా నిర్ణ‌యించారు.

అనవసర ప్రయాణాల కట్టడికి:
కరోనా సమయంలో అనవసర ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతో, ప్రయాణికుల భద్రత కోసం ఛార్జీలను పెంచినట్టు ఇండియన్ రైల్వేస్ అలాగే ప్లాట్ ఫాంపై ఎక్కువమంది గుమిగూడకుండా చూడటం కోసమే ప్లాట్ ఫాం టికెట్ల ధరలను పెంచినట్టు వివరణ ఇచ్చింది. కాగా, ఈ ధరల పెంపు తాత్కాలికమే అని చెప్పింది. పరిస్థితుల్లో మార్పు వచ్చాక టికెట్ల రేట్లు తగ్గించే అవకాశం ఉంది. కాగా, టికెట్ల ధరల పెంపు కొత్తదేమీ కాదని.. రైల్వే స్టేషన్లలో రద్దీని కంట్రోల్ చేసేందుకు అప్పుడప్పుడూ అమలు చేస్తుంటామని రైల్వే శాఖ చెప్పుకొచ్చింది.

ధరల పెంపు తాత్కాలికమే:
ఛార్జీల పెంపుపై రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ”ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. స్టేషన్లలో రద్దీని నివారించడానికి రైల్వే శాఖ తీసుకున్న తాత్కాలిక చర్య” అని ప్రకటనలో తెలిపింది. అటు ప్లాట్‌ఫాం టికెట్ ఛార్జీలు మార్చే విషయంలో స్టేషన్ DRMలకు రైల్వే శాఖ పూర్తి బాధ్యతను అప్పగించింది.

స్వల్ప దూర ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలూ పెరిగాయి:
ఇటీవలే స్వల్ప దూర ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలను రైల్వే శాఖ పెంచిన సంగతి తెలిసిందే. ప్రయాణీకులు చిన్న ప్రయాణానికి(30-40కిమీ) కూడా మెయిల్ / ఎక్స్‌ప్రెస్‌కు సమానమైన ఛార్జీలను చెల్లించాల్సి పరిస్థితి వచ్చింది.

indian railways

ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.50కి పెంపు:
కాగా, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంటో.. ముంబై, నగర శివారు రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. రూ. 10గా ఉన్న టికెట్ ధరను ఏకంగా రూ. 50కి పెంచుతూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంపై కరోనా మహమ్మారి మరోమారు పగబట్టిన నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మార్చి 1 అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాదర్, లోక్‌మాన్య తిలక్ టెర్మినస్‌తోపాటు థానే, కల్యాణ్, పాన్‌వెల్, భీవండి రోడ్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచారు.