బెంగాల్ దంగల్ : మోడీ మెగా ర్యాలీ, స్పెషల్ ఎట్రాక్షన్ అక్షయ్ కుమార్

బెంగాల్ దంగల్ : మోడీ మెగా ర్యాలీ, స్పెషల్ ఎట్రాక్షన్ అక్షయ్ కుమార్

PM Modi’s mega rally : బెంగాల్ దంగల్ మరింత వేడెక్కింది. అధికార టీఎంసీపై దండయాత్రకు కాషాయదళం రెడీ అవుతోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సమరశంఖం పూరించేందుకు కోల్ కతాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది. ఈ సభకు పది లక్షల మందిని సమీకరించాలని బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ సభకు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హాజరవుతుండడం విశేషం. అంతేగాకుండా..అలనాటి హీరో మిథున్ చక్రవర్తి కాషాయ కండువా కప్పుకోనున్నారు. టీఎంసీ తరపున రాజ్యసభకు మిథున్ ప్రాతినిథ్యం వహించారు. బెంగాల్ చరిత్రలో మోడీ నిర్వహించబోయే ర్యాలీ అతిపెద్దది కాబోతోందని బీజేపీ నేతలు అంటున్నారు.

బెంగాల్ ఎన్నికలను కమలం పార్టీ అత్యంత ప్రతష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటన రాకముందే..పార్టీ అధిష్టానం పెద్దలు బెంగాల్ లో విస్తృతంగా పర్యటించారు. టీఎంసీని ఇంటికి పంపించి..బెంగాల్ లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా…టీఎంసీ పార్టీకి చెందిన కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నిస్తోంది. కీలక పార్టీ నేతలు టీఎంసీకి గుడ్ బై చెప్పి..బీజేపీ కండువా కప్పుకొంటున్నారు. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారిని బరిలోకి దింపింది బీజేపీ.

రెండు సార్లు వరుసగా విజయం సాధించిన మమతా బెనర్జీ (దీదీ) ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలనే ధృఢ సంకల్పంతో ఉన్నారు. మరోవైపు.. ఎలాగైనా బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో వ్యూహం రచిస్తోంది బీజేపీ. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ప్రకటన ఉండడంతో ప్రచారంలో మరింత జోరు పెంచేందుకు ప్రధాని సీన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మరి బెంగాల్ గడ్డ మీద టీఎంసీ జెండా ఎగురుతుందా ? కాషాయ జెండా ఎగురుతుందా ? అనేది చూడాలి.