PS Narasimha : సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. పీఎస్ నరసింహ!

మన తెలుగు తేజం.. సుప్రీంకోర్టులో సీనియ‌ర్ న్యాయ‌వాది.. ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. పీఎస్ నరసింహ.. 2027లో ఆయన సీజేఐ అయ్యే అవకాశం ఉంది.

PS Narasimha : సుప్రీం పీఠంపై తెలుగు తేజం.. పీఎస్ నరసింహ!

Ps Narasimha Will Be Third Appointee From Bar To Become Cji

PS Narasimha become CJI : మన తెలుగు తేజం.. సుప్రీంకోర్టులో సీనియ‌ర్ న్యాయ‌వాది.. ఇప్పుడాయన ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కోదండరామయ్య కుమారుడే ఈ పీఎస్‌ నరసింహ. ఈయన హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. పి.ఎస్ నరసింహ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే పూర్తి అయింది. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.. పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. భ‌విష్య‌త్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా పిఎస్ నరసింహ బాధత్యలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టులో కొత్తగా 9మంది న్యాయమూర్తుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ ఆమోదం తెలిపారు. ఈనెల 31న 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారిలో ఒకరే పీఎస్ నరసింహ..

మరో తెలుగు వ్యక్తిగా నరసింహ : 
ఇప్పటివరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇద్దరు తెలుగువారు పనిచేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్‌ కోకా సుబ్బారావు చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రెండో తెలుగు వ్యక్తిగా చరిత్రపుటల్లోకెక్కారు. భవిష్యత్తులో ఈ అత్యున్నత పదవిని చేపట్టబోయే మరో తెలుగు వ్యక్తిగా పీఎస్ నరసింహ కానున్నారు. ప్రస్తుతం ఈయన సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వొకేట్‌‌గా ఉన్నారు. పీఎస్ నరసింహ నియామకానికి కేంద్రం, రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన ఆరో లాయర్‌గా పీఎస్‌ నరసింహ చరిత్ర సృష్టించారు.

మరోవైపు.. తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని సుప్రీం జడ్జిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు కొలీజియం.. సుప్రీంకోర్టులో బాధ్యతలు స్వీకరించడానికి కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తుల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చీఫ్‌ జస్టిస్‌తో కలిపి 24 మంది జడ్జిలు ఉన్నారు. కొత్తగా 9 మంది నియామకంతో ఆ సంఖ్య 33కు చేరింది. అటు సుప్రీంకోర్టు న్యాయముర్తుల్లో తెలుగు వారి సంఖ్య నాలుగుకు చేరింది. చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టు జడ్జీలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడా జాబితాలో నరసింహ కూడా చేరారు.

2014-2018 మధ్య అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేశారు పీఎస్ నరసింహ. అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్‌మాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్‌ రామచంద్రదాస్‌ తరఫున నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్‌ క్యూరీగా సేవలందించారు. ఇటాలియన్‌ మెరైన్ కేసులో కేంద్రం తరఫున సుప్రీంకోర్టులోనూ నరసింహ వాదనలు వినిపించారు. 2027లో పీఎస్ నరసింహ సీజేఐ అయితే బార్ నుంచి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే మూడవ లాయర్‌గా పీఎస్ నరసింహ నిలుస్తారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పి.ఎస్‌.నరసింహ నియామకంపై కృష్ణా జిల్లా గణపవరం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. సుప్రీంకోర్టులో జడ్జిలుగా బాధ్యతలు చేపట్టనున్నవారిలో బీవీ నాగరత్న.. 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. అదే జరిగితే భారత ప్రధాన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.