అలా చేస్తే పంజాబ్ అగ్నిగుండమవుతది…కేంద్రానికి సీఎం హెచ్చరిక

  • Published By: venkaiahnaidu ,Published On : August 18, 2020 / 09:55 PM IST
అలా చేస్తే పంజాబ్ అగ్నిగుండమవుతది…కేంద్రానికి సీఎం హెచ్చరిక

సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్‌-యుమునా లింక్‌ కెనాల్‌ పూర్తయితే పంజాబ్‌ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంజాబ్‌ తగలబడిపోతాదని, హర్యాణాతో నీటి పంపక వివాదం జాతీయ భద్రతకు సమస్యగా పరిణమిస్తుందని అమరీందర్‌ సింగ్‌ అన్నారు.



పంజాబ్, హర్యానా మధ్య నెలకొన్న జల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మంగళవారం ఇరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సట్లెజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కాలువపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం అమరీందర్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో సట్లెజ్‌-యమునా లింక్‌ కెనాల్‌పై ముందుకెళితే జాతీయ భద్రతకు పెను సవాల్‌ ఎదురవుతుందని అమరీందర్‌ సింగ్‌ కేంద్రాన్ని హెచ్చరించారు.



దీని వల్ల పంజాబ్‌తోపాటు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. 1966లో పంజాబ్ విభజన జరిగిన తర్వాత నీటిని తప్ప తమ ఆస్తులన్నీ 60:40 ప్రాతిపదికన విభజించారని అమరీందర్ తెలిపారు. పంజాబ్, హర్యానా మధ్య రవి, బియాస్, సట్లెజ్ నీటి జలాలు ఉమ్మడిగా ఉన్నాయని యమునా లేదన్నారు. సట్లెజ్-యమునా నదుల అనుసంధానం నేపథ్యంలో యమునా జలాలను కూడా చేర్చి ఇరు రాష్ట్రాల మధ్య 60:40 ప్రాతిపదికన నీటి పంపకాలు జరుపాలని సూచించినట్లు అమరీందర్ పేర్కొన్నారు.



పంజాబ్‌, హర్యాణా రాష్ట్రాల ఏర్పాటు అనంతరం 1966లో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకంపై వివాదం నెలకొంది. నదీ జలాల్లో హర్యాణా అధిక వాటా కోరుతుండగా, మిగులు జలాలు లేవని వాదిస్తూ పంజాబ్‌ ఇందుకు నిరాకరిస్తోంది. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేస్తూ దీనికోసం కాలువను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.



దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఈ కాలువ పనులను పూర్తిచేసేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మీదట ఈ భేటీ జరిగింది. మిగులు జలాలు ఉంటే పొరుగు రాష్ట్రానికి నీరు ఇచ్చేందుకు తమకు ఎలాంటి సమస్య లేదని సమావేశం అనంతరం అమరీందర్‌ సింగ్ తెలిపారు. నీటి లభ్యతపై అంచనా కోసం తాజా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. హరియాణా సీఎంతో ఈ అంశంపై మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు.



జల వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చలు కొనసాగిస్తూనే కాలువ నిర్మాణం పూర్తిచేయాలని కేంద్ర మంత్రి షెకావత్‌ పేర్కొన్నారు. కాగా, ఈ అంశంపై తదుపరి చర్చల కోసం​ రెండు రాష్ట్రాలు చండీగఢ్‌లో సంప్రదింపులు జరుపుతాయని హరియాణ ముఖ్యమంత్రి ఖట్టర్‌ తెలిపారు