డ్రాగన్ తోక ముడుచుకోవాల్సిందే : భారత్​కు బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 27, 2020 / 03:23 PM IST
డ్రాగన్ తోక ముడుచుకోవాల్సిందే : భారత్​కు బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు

మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ధవిమానాలు చేరుకోనున్నాయి. రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్​కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ధ విమానాలు భారత్​కు చేరుకోనున్నాయి.

ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవాళ(జులై-27,2020) 5 రఫేల్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఈ ఐదు రఫేల్ విమానాలు బుధవారం నాటికి భారత్​లోని అంబాలా వైమానిక స్థావరానికి అవి చేరుకుంటాయి. మార్గమధ్యలో అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద రఫేల్​ విమానాలు ఆగనున్నట్లు ఎయిర్​ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఫ్రాన్స్ నుంచి అంబాలాకు సుమారు 7364 కిలోమీట‌ర్లు ఈ యుద్ధ విమానాలు ప్ర‌యాణిస్తాయి. తొలిదశలో రానున్న 5 విమానాలలో రెండు శిక్షణ, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్రాన్స్‌తో మొత్తం 36 యుద్ధ‌విమానాల‌కు ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. రాఫేల్ యుద్ధ విమానాల్లో ఎగిరేందుకు భార‌త వాయు సేన‌కు చెందిన 12 మంది పైల‌ట్లు ఫ్రాన్స్‌లోనే శిక్ష‌ణ పొందారు. మ‌రికొంత మంది అడ్వాన్స్‌డ్ ద‌శ‌లో ట్రైనింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మొత్తం 36 మంది ఐఏఎఫ్ పైల‌ట్ల‌కు ఫ్రాన్స్ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ది.

మరోవైపు, తూర్పు లడఖ్ సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో రఫేల్ విమానాల రాక భారత సైన్యానికి మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయింది.