మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

rise in petrol, diesel prices: దేశవ్యాప్తంగా వరుసగా 8వ రోజూ(ఫిబ్రవరి 16,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధ‌ర‌ 30 పైసలు, డీజిల్ ధ‌ర 35 పైసలు పెరిగాయి. దీంతో అక్క‌డ లీట‌రు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధ‌ర రూ.79.70 కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకి‌ రూ.95.75కి చేరింది. అలాగే, డీజిల్‌ ధర రూ.86.35కు ఎగ‌బాకింది.

ఇక హైదరాబాద్‌లోనూ ఇంధన ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర‌ రూ.94.69కి చేర‌గా, డీజిల్‌ ధర రూ.89.36గా ఉంది. బెంగళూరులో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.92.28, డీజిల్ ధ‌ర రూ.84.49గా ఉంది. చెన్నైలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.45, డీజిల్ ధ‌ర రూ.84.77గా ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్ లోని పలు సిటీస్ లో ప్రీమియం పెట్రోల్ ధర మండిపోతోంది. అక్కడ పెట్రోల్ ధర ఇప్పటికే సెంచరీ దాటింది. ప్రీమియం పెట్రోల్ కావాలంటే లీటర్ కు వంద రూపాయలపైనే చెల్లించాలి.

కేవలం 15 రోజుల్లో పెట్రోల్ ధర రూ.4.92 పెరిగింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.89.77 ఉంది. ఇప్పుడు రూ.94.69 అయ్యింది. ఈ ధరల పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం పెట్రోలుపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిపి 61 శాతం పన్ను విధిస్తున్నాయి. అలాగే డీజిల్‌పై 56 శాతం టాక్స్ విధిస్తున్నాయి. వీటిని తొలగిస్తే… పెట్రోల్, డీజిల్ రూ.40 నుంచి రూ.45 కే వచ్చే అవకాశాలు ఉంటాయి.

ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ 50 శాతం పెరిగాయి. బ్యారెల్ ధర 63.3 డాలర్లకు చేరింది. అందువల్లే ధరలు పెంచుతున్నట్లు చమురు కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఇందులో పూర్తిగా నిజం లేదు. చెప్పాలంటే జనవరి నుంచి భారతీయులు చాలా ఎక్కువే చెల్లిస్తున్నారు. ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నా… ఇండియాలో మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి.

నిజానికి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ మేరకు దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలి. కానీ చమురు కంపెనీలు అలా చెయ్యట్లేదు. కానీ విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు మాత్రం… ఇండియాలో ధరలను పెంచేస్తున్నాయి. ఈ విషయంలో టాక్సుల రూపంలో మనీ వస్తున్నందున అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు సైలెంట్ అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

మొత్తంగా అడ్డూఅదుపూ లేని రీతిలో రోజురోజుకూ ఇంధన ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. కాగా, ఇంధన ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆయిల్ కంపెనీలు చెప్పడం వినియోగదారుల గుండెల్లో వణుకు పెంచింది.