మరో ఉన్నావో ఘటన వద్దు : “లా” విద్యార్థిని అదృశ్యంపై సుప్రీంలో లాయర్ల పిటిషన్

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 07:08 AM IST
మరో ఉన్నావో ఘటన వద్దు : “లా” విద్యార్థిని అదృశ్యంపై సుప్రీంలో లాయర్ల పిటిషన్

బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్‌ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా  లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ  కొంతమంది సుప్రీం లాయర్లు ఇవాళ(ఆగస్టు-28,2019) ఓ పిటిషన్ ఫైల్ చేశారు. 

మరో ఉన్నావో ఘటన జరగకూడదని తాము కోరుకుంటున్నట్లు పిటిషన్ ఫైల్ చేసిన సుప్రీం లాయర్లు తెలిపారు. అదృశ్యమైన యువతి తల్లిదండ్రుల కంప్లెయింట్ ఆధారంగా స్వామి చిన్మయానందపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసు టీమ్ లను షహజన్ పూర్ ఎస్పీ రంగంలోకి దించారు.

స్వామి చిన్మయానంద…ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితం నాశనం చేశాడు. తనను కూడా బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఎల్‌ఎల్‌ఎం (పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా) విద్యార్థిని ఫేస్‌బుక్‌ లైవ్‌ చేసింది. సన్యాసి రూపంలో  ఉన్న ఆయన పోలీసు ఉన్నతాధికారులు తన చెప్పు చేతల్లో పెట్టుకుని, తనను ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తూ వుంటాడని వాపోయింది. తనకు, తన కుటుంబానికి ముప్పు ఉందని కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

ఈ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో  శనివారం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. కిడ్నాప్ కు గురైన యువతి లా చదువుతున్న ఎస్ఎస్ పోస్ట్ గ్రాడ్యేయేట్ కాలేజీ చైర్ పర్శన్ గా కూడా స్వామి చిన్మయానంద ఉన్నారు. గతంలో కూడా స్వామిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.