Divorce : విడాకులపై సుప్రీంకోర్టు తీర్పుతో హిందూ వివాహ వ్యవస్థపై సరికొత్త చర్చ.. ఆ వాదన కరక్టేనా!?

సుప్రీం తీర్పుతో విడాకులు తీసుకోవడం ఈజీ అనే భావన పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయనిపుణులు మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు.

Divorce : విడాకులపై సుప్రీంకోర్టు తీర్పుతో హిందూ వివాహ వ్యవస్థపై సరికొత్త చర్చ.. ఆ వాదన కరక్టేనా!?

supreme court verdict on divorce: విడిపోదామని డిసైడ్ అయిన దంపతులు వెంటనే డివోర్స్ తీసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పు సంచలనమైంది. దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేచింది. వైవాహిక బంధం సరిగా లేనప్పుడు.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నప్పుడు విడాకులు ఇవ్వడానికి కోర్టుకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది సుప్రీం. పరస్పర నమ్మకం.. సంప్రదాయం.. కుటుంబ గౌరవాలతో ముడిపడివున్న హిందూ వివాహ వ్యవస్థలో విడాకుల అంటే పెద్ద అగాధం కిందే పరిగణిస్తారు. తీవ్ర సమస్యగా పరిగణించే విడాకులపై సుప్రీం ఇచ్చిన తీర్పు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.

వైవాహిక జీవితం సక్రమంగా లేని జంటలు.. విడిపోదామని డిసైడ్ అయి కోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సుప్రీం పచ్చజెండా ఊపింది. వేర్వేరుగా బతకాలని డిసైడ్ అయిన తర్వాత ఆర్నెల్లు ఆగండి అంటూ వెయిటింగ్‌లో పెట్టడంలో అర్థం లేదని.. భార్యభర్తలు ఇద్దరూ కోరుకుంటే తక్షణం విడాకులు ఇవ్వడానికి కోర్టుకు అభ్యంతరం లేదని ఖరాకండీగా తేల్చిచెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీం తీర్పుతో హిందూ వ్యవస్థలో సంక్లిష్టంగా ఉన్న విడాకులపై స్పష్టత వచ్చినట్లైంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదాస్పద అంశంపై సుప్రీం ఒక్క ముక్కలో తేల్చేసింది. పరస్సర నమ్మకం.. గౌరవం, బాధ్యత లేని దంపతులు కలిసివుండమని బలవంతం చేయడంపై న్యాయస్థానానికి ఎటువంటి ఆసక్తి లేదని చెప్పింది సుప్రీం. ఇద్దరూ కోరుకుంటే.. ఇతర అభ్యంతరాలు లేకపోతే న్యాయస్థానాలు విడాకులు (Divorce) మంజూరు చేయొచ్చని తేల్చిచెప్పింది సుప్రీం.

పరస్పర అంగీకారంతో వెనువెంటనే విడాకులు
విడాకులపై ఇంత స్పష్టంగా సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఆదేశాలు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ఆధునిక కాలంలో యువతీయువకుల భావజాలం మారి పోయింది. భార్యభర్తలైనా ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకుంటున్న చాలామంది ఎవరి బతుకు వారి బతకాలని నిర్ణయించుకుంటున్నారు. ఒకరి స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు ఇంకొకరు అడ్డుగా ఉండకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి వారు పరస్పర అంగీకారంతో విడాకులకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ నిర్ణయించుకుని విడిపోవడానికి సిద్ధమైనా మనం చట్టం వెంటనే విడాకులు తీసుకోడానికి అనుమతించడంలేదు. మీరు నిర్ణయం తీసుకున్నా.. మళ్లీ మనసు మారుతుందేమో ఓ ఆర్నెల్లు ఆగి చూడండి.. అప్పుడు చూద్దాం అంటూ వెయిటింగ్‌లో పెడుతోంది కోర్టు. అయితే ఈ ఆర్నెల్లలో విడిపోదామనుకుంటున్న దంపతులు ఎక్కడా కలిసే పరిస్థితి కనిపించడం లేదు. 90 శాతం కేసుల్లో ఇదే పరిస్థితి ఉండటంతో ఆర్నెల్ల తర్వాతైనా విడాకులు మంజూరు చేయడం తప్పడం లేదు. ఇప్పుడు సుప్రీం నిర్ణయంతో ఇలాంటి పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభిస్తుంది.

ఇష్టం లేని పెళ్లిళ్లకు తక్షణ పరిష్కారం
నిజానికి హిందూ వివాహ చట్టం (hindu marriage act) లో విడాకులు చాలా క్లిష్టమైన అంశం. పెళ్లి చేసినంత వేగంగా విడాకులు మంజూరు చేయరు. కోర్టులే కాదు. ఓ జంట విడిపోవాలంటే సమాజం కూడా అంగీకరించదు. రకరకాలుగా ప్రశ్నిస్తుంది. కలిసి బతికితే బాగుంటుందని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇంటి పెద్దల నుంచి గ్రామపెద్దలు, పోలీసులు, కౌన్సిలింగ్ సెంటర్లు.. ఇలా చాలా మంది.. విడిపోదామనే జంటలకు ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. విడాకులు (Divorce) క్షణకాలంలో తీసుకున్న నిర్ణయం కాదని.. కుటుంబ జీవితంలో కలహాలు కామన్ అని.. ఒకరినొకరు అర్థం చేసుకుని బతకాలని మంచిమాటలు చెబుతుంటారు. కానీ, ఇవన్నీ దాటుకుని.. అందరినీ ఒప్పించి న్యాయబద్ధంగా విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టులను ఆశ్రయిస్తున్నారు చాలామంది దంపతులు. ఇద్దరూ పరస్పరం విడిపోవాలని నిర్ణయం తీసుకుని కోర్టులకు వచ్చినప్పుడు ఇంటి పెద్దలతోపాటు.. ఇతర దశలన్నీ అధిగమిస్తున్నారు. అలాంటి సమయంలో కూడా ఆర్నెల్లు ఆగమని ఇన్నాళ్లు కోర్టులు విడాకుల దరఖాస్తులను పెండింగ్‌లో పెడుతుండేవి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఏ అడ్డంకులూ లేకుండా విడిపోడానికి.. విడాకులు తీసుకోడానికి మార్గం సుగమం అయినట్లేనని భావిస్తున్నారు.

Also Read: విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

అన్ని కేసుల్లోనూ కాదు..
అయితే సుప్రీం తీర్పుతో విడాకులు తీసుకోవడం ఈజీ అనే భావన పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయనిపుణులు మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు. అన్ని కేసుల్లోనూ వెంటనే
విడాకులు మంజూరు చేయమని కోర్టు చెప్పలేదని.. ఇద్దరూ నిర్ణయించుకున్న కొన్ని కేసులకే సుప్రీం నిర్ణయం పరిమితమవుతుందని అంటున్నారు. ఇలాంటి కేసు విషయంలోనూ కొన్ని సూచనలు చేసిందని చెబుతున్నారు. ఇద్దరు విడిపోవడానికి కారణాలు, ఆ సమయంలో వారు ఒకరిపై ఇంకొకరు చేసే ఆరోపణలు, పిల్లల బాధ్యత, ఇతర సామాజిక, ఆర్థికపరమైన అంశాలను పరిశీలించాలని కోర్టు నిర్దేశించిందని చెబుతున్నారు.

Also Read: ప్రపంచంలో విడాకుల శాతం ఎక్కువ ఉన్న దేశాలు ఏవో తెలుసా..? భారత్ పరిస్థితి ఏమిటి?

ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు హాని
అయితే హిందూ వివాహ వ్యవస్థ (hindu marriage system) లో విడిపోవడం అనే ప్రశ్నకు స్థానం లేదని… అది మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు హాని చేస్తుందనే వాదన వినిపిస్తోంది. కానీ, ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాల ప్రభావం తగ్గిపోవడం.. సొంతంగా.. స్వేచ్ఛగా గడపాలనే ఆకాంక్షలు పెరిగిపోవడం.. చాలా మంది ఆర్థిక, సామాజిక ఎదుగుదల వివాహ బంధానికి అడ్డుగోడగా మారుతోంది. ఒకరికొకరు అర్థం చేసుకుని బతకాలనే కట్టుబాటు స్థానంలో ఒకరినొకరు గౌరవించుకుని విడిపోవడం మేలన్న భావన పెరిగిపోతోంది. ఇలా ఇద్దరు అవగాహనతో నిర్ణయించుకున్నాక కోర్టులు మరికొన్నాళ్లు ఆపడం అనవసరమనే ఆలోచనతోనే సుప్రీం తీర్పునిచ్చిందని అంటున్నారు న్యాయ నిపుణులు.

Also Read: అటువంటి భార్యాభర్తల్ని కలిసుండమంటే క్రూరత్వానికి పర్మిషన్ ఇచ్చినట్లే.. వారి బంధం ముగియాల్సిందే : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విడాకులు దంపతులు హక్కేమీ కాదు
అయితే మ్యూచవల్ డివైర్స్‌కు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. విడాకులు దంపతులు హక్కేమీ కాదని తేల్చిచెప్పింది. విడిపోవాలని అనుకున్నప్పుడు అందుకు స్పష్టమైన కారణాలు చెప్పాల్సివుంటుందని.. అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియ చేపట్టాలని దిగువ కోర్టులకు సూచనలిచ్చింది సుప్రీం. ఇరుపక్షాలకు పూర్తి న్యాయం జరిగేలా న్యాయస్థానాల నిర్ణయం ఉండాలని.. వివాహ బంధం పూర్తిగా దెబ్బతిన్నదనే విషయంపై దిగువ కోర్టులు ఎలా నిర్ధారణకు రావాలో అనే విషయంపైనా స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.