సీఎం ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి కరోనాతో మృతి

  • Published By: vamsi ,Published On : June 18, 2020 / 03:42 AM IST
సీఎం ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తి కరోనాతో మృతి

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. తమిళనాడులో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై చిగురుటాకులా వణికిపోతుంది. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దామోదరన్‌ అనే వ్యక్తి కరోనాతో చనిపోయారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కార్యాలయంలో పనిచేస్తున్న 56 ఏళ్ల దామోదరన్‌.. చెన్నైలో కరోనావైరస్ కారణంగా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.  దామోదరన్‌ ‘సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ’గా పనిచేస్తున్నారు.

ఒమాండురార్ ఎస్టేట్‌లోని ప్రభుత్వ మల్టీ-సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరాడు. అనంతరం రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (ఆర్‌జిజిజిహెచ్) మార్చారు. అందులో ఆయనకు పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో చికిత్స కోసం ఆ ఆస్పత్రిలోనే ప్రత్యేక వార్డులో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఆయన చికిత్స ఫలించక చనిపోయారు.

ఆయన కుటుంబం సైదాపేటలోని ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌లో నివసిస్తోంది. ఇదిలా ఉంటే, తమిళనాడులో సెక్రెటేరియట్‌లో పనిచేసే అనేక మంది ఐఏఎస్ అధికారులు మరియు వివిధ ర్యాంకుల్లో ఉన్న అధికారులు 200 మంది వరకు కరోనా వైరస్‌కు గురై చికిత్సలో ఉన్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Read: దేశంలో మరోమారు లాక్ డౌన్ ఉండదు : ప్రధాని మోడీ