ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ విడుదల

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ విడుదల

five states Assembly elections : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల తేదీ వెలువడనుంది.

దేశంలో ఎన్ని కల సందడి మొదలయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీల పదవీకాలం మేతో ముగియనుంది. కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీల పదవీకాలంలో జూన్‌తో పూర్తికానుంది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలుండగా తమిళనాడులో 234 స్థానాలున్నాయి. కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న రాష్ట్రాల్లో అందరి దృష్టి ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌పై ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించాలని ఆ రాష్ట్రంలో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి నేతలు ఇప్పటికే బెంగాల్‌లో విస్తృతంగా పర్యటించారు. పదేళ్లగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై వ్యతిరేకత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వామపక్షాలు బలహీనపడడం వంటి కారణాలు బీజేపీకి అధికారం కట్టబెడతాయని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. మరోవైపు బీజేపీని బెంగాల్‌లో అడుగుపెట్టనివ్వకూడదనే పంతంతో మమత ప్రణాళికలు రచిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికీ మారిపోతున్నాయి. ఇద్దరు రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో యావత్ దేశం తమిళనాడు వైపు చూస్తోంది. గత సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన అన్నాడీంకె… జయలలిత మరణం తర్వాత దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. తమిళ రాజకీయాలకు ఈ అసెంబ్లీ ఎన్నికల ద్వారా బలమైన నేత లభిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి సాగుతున్నాయి.

డీఎంకె, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వంటి నేతలు అన్నాడీఎంకెలో ఉన్నప్పటికీ..శశికళ జైలు నుంచి విడుదల కావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విభేదాలు పక్కనపెట్టి…కలిసి పనిచేద్దామని జయలలిత వర్ధంతి రోజు శశికళ ఇచ్చిన ఆఫర్‌పై ఓపీఎస్, ఈపీఎస్ ఇంకా స్పందించలేదు. మరోవైపు డీఎంకె మాత్రం అన్నాడీఎంకెను ఓడించి అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో ఉంది.

శబరిమలలో మహిళల ప్రవేశం, గోల్డ్ స్కాం వంటి విషయాలతో తరచూ వివాదాలకు నిలయంగా మారిన కేరళలోనూ ఈ అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేక ప్రభావం చూపనున్నాయి. అధికార ఎల్‌డీఎఫ్‌ను ఓడించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కేరళలో కలియతిరుగుతున్నారు. కేరళలోనూ ఏ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రాదు. అయితే…కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న తీరు, రైతుల ఆందోళనకు మద్దతు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతున్న తీరు…గత సంప్రదాయానికి భిన్నంగా తమను అధికారంలోకి తీసుకువస్తుందని పినరయి విజయన్ భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు…రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది పుదుచ్చేరి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం మైనార్టీలో పడడంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేశారు. నిన్నటి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకొచ్చింది. ఈ పరిస్థితుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు లభిస్తాయా లేక బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగిన అసోంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపనున్నాయి.