మే 10న ఏపీ కేబినెట్ భేటీ : సర్వత్రా ఉత్కంఠ

  • Published By: chvmurthy ,Published On : May 7, 2019 / 08:01 AM IST
మే 10న ఏపీ కేబినెట్ భేటీ : సర్వత్రా ఉత్కంఠ

అమరావతి : ఏపీ కేబినెట్  మే 10 న సమావేశం కానుంది. ఇందుకు సంబంధించి అజెండా రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకి… ముఖ్యమంత్రి  కార్యాలయం అధికారులు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోని తుపాను నష్టం, వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణ, ఖరీఫ్‌ కార్యాచరణ ప్రణాళిక.. తదితర అంశాలను  కేబినెట్‌లో అజెండాలో చేర్చే అవకాశం ఉంది. సీఎంవో సూచనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలా స్పందిస్తారన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో అజెండాలకే పరిమితమవుతారా… లేక  బిజినెస్‌ రూల్స్‌పై చర్చిస్తారా.. అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం  కేబినెట్ భేటీఅంశంపై సీఈవో గోపాలకృష్ణ ద్వివేదితో చర్చించారు. ఎన్నికల కోడ్‌ ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి.. గోపాలకృష్ణ ద్వివేది సూచించిన నేపథ్యంలో .. మంత్రివర్గ సమావేశం జరగుతుందా.. లేదా.. అన్న అంశంపై కూడా  చర్చ జరుగుతోంది.  కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి  వారు ఇచ్చిన సూచనలు మేరకు నడుచుకోవాలని సీఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.