ఏపీలో కొత్తగా 300 గ్రామ సచివాలయాల ఏర్పాటు

  • Published By: chvmurthy ,Published On : January 8, 2020 / 10:06 AM IST
ఏపీలో కొత్తగా 300 గ్రామ సచివాలయాల ఏర్పాటు

రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న15,971 పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 300  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా మరో 3వేల మందిని నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. మంగళవారం సీఎం జగన్ పంచాయతీరాజ్ శాఖపై సంబంధిత శాఖల అధికారులతో…ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, నాడు– నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ అంశాలపై సమీక్ష జరిపారు. 

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం  ఆదేశించారు. ఫిబ్రవరి నెల నుంచి లబ్దిదారులు పెన్షన్లకోసం ఎదురుచూపులు చూడకుండా..గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్దిదారుల ఇంటి వద్దకే చేరేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు.  ఉపాధిహామీ నిధులతో  మినీ గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని…అనంతరం స్కూళ్లకు ప్రహరీ గోడలను నిర్మించాలని కూడా ఆయన చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులను గుర్తించి..ఎంత మంది ఉంటే అంత మందికి ఇళ్ళపట్టాలను ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున వ్యవసాయరంగంలో పనులు లభిస్తున్నాయని అధికారులు సీఎం కు వివరించారు. మార్చి నాటికి అనుకున్న పనిదినాలతో లక్ష్యాన్ని చేరుకుంటామని.. ఉపాధి హామీ నిధుల ఖర్చులో లక్ష్యాలను చేరుకుంటున్నామని అధికారులు వివరించారు.