Eatala Rajender : అనుకున్నది ఒక్కటి, అయినది మరొకటి.. బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఈటల రాజేందర్? ప్రతీకారం తీర్చుకోవడం ఎలా అని మదనం
బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునే ప్లాన్ ఒక్కటి కూడా సక్రమంగా అమలయ్యే దారి కనిపించడం లేదని.. Eatala Rajender - BJP

Eatala Rajender - BJP
Eatala Rajender – BJP : కమలం పార్టీపై కీలక నేత ఈటల అసంతృప్తితో రగిలిపోతున్నారా? పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించిన తర్వాత తాను అనుకున్నదే జరుగుతుందని ఆశించిన ఈటలకు ఎదురుదెబ్బ తగిలిందా? తన వారిని పార్టీలో చేర్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? ఈటల అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడం అంత తేలికైన పనికాదా? ఎప్పటికప్పుడు ఈటల అసంతృప్తికి కారణాలు ఏంటి? తెరవెనుక ఏం జరుగుతోంది?
అధికార బీఆర్ఎస్ పై ఆగ్రహంతో బీజేపీలో చేరిన ఈటల తరుచూ అసంతృప్తి రాగాన్ని వినిపిస్తూనే ఉన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తన గెలుపును పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా తిరిగే అవకాశం ఇవ్వడం లేదని అసంతృప్తి చెందారు ఈటల. కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించాక మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే, మళ్లీ ఇప్పుడు ఈటల వ్యూహాలకు విరుద్ధంగా బీజేపీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండటంతో అసంతృప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.(Eatala Rajender)
ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించినా పవర్ ఇవ్వలేదని పార్టీ వైఖరిపై కినుక వహిస్తున్నారు ఈటల. దీనికి రెండు ఉదాహరణలు చెబుతున్నారు ఆయన అనుచరులు. చేరికల కమిటీ ఛైర్మన్ గా ఈటల తీసుకుంటున్న నిర్ణయాలకు కోర్ కమిటీలో చెక్ పడుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీలో కొత్తగా ఎవరు చేరాలన్నా కోర్ కమిటీలోనే తుది నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకున్న అనుభవంతో కొత్త నేతలను చేర్చుకునేందుకు ఈటల ప్రయత్నం చేస్తున్నా.. కోర్ కమిటీ ఓకే చేయడం లేదని అంటున్నారు.
Also Read..YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?
ఇందుకు మాజీమంత్రి కృష్ణ యాదవ్ వ్యవహారాన్ని ఎత్తిచూపుతున్నారు. అంబర్ పేట్ నుంచి టికెట్ ఆశిస్తున్న కృష్ణ యాదవ్.. బీజేపీలో చేరికకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఆయన పార్టీలో చేరకముందే అంబర్ పేట్ నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించడంతో బీజేపీలో చేరికకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. కానీ, కృష్ణయాదవ్ ఓ అడుగు ముందుకేసి ప్రకటన చేసేయడం అది కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అడుగుతుండటంతో ఆయన చేరికకు బ్రేక్ పడింది.(Eatala Rajender)
తానెంతో కష్టపడి బీజేపీలో చేరేందుకు కృష్ణయాదవ్ ను ఒప్పిస్తే తనతో ఏమాత్రం సంప్రదించకుండా చేరిక కార్యక్రమం వాయిదా వేశారని అసంతృప్తి చెందుతున్నారట ఈటల. మరోవైపు తన సొంత జిల్లాకు చెందిన డాక్టర్ చెన్నమనేని వికాస్ రావ్ చేరిక సమయంలో ఈటల కనిపించకపోవడంపైనా రకరకాల ప్రచారం జరుగుతోంది. మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావ్ కుమారుడు అయిన చెన్నమనేని వికాస్ రావ్ కుటుంబానికి పార్టీలో గట్టి పట్టుంది. వచ్చే ఎన్నికల్లో వికాస్ రావ్ ని వేములవాడలో పోటీ చేయించాలని చూస్తోంది కమలం పార్టీ.
Also Read.. Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?
ఇప్పుడు చెన్నమనేని కుటుంబం ఎంట్రీతో వేములవాడలో ఈటల పథకం ఫలించేలా కనిపించడం లేదు. దీంతో వికాస్ రావ్ చేరిక కార్యక్రమానికి కూడా ముఖం చాటేశారు ఈటల. పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్, ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పటికీ తనకు మింగుడుపడని విధంగా పార్టీ వ్యవహారాలు ఉంటున్నాయని మదనపడుతున్నారట ఈటల. మొత్తానికి బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకునే ప్లాన్ ఒక్కటి కూడా సక్రమంగా అమలయ్యే దారి కనిపించడం లేదని అసంతృప్తి చెందుతున్నారని ప్రచారం జరుగుతోంది.