ఎస్.పీ, బీఎస్పీ కలయిక: గులాబీదళంలో ఉత్సాహం

  • Published By: chvmurthy ,Published On : January 13, 2019 / 11:38 AM IST
ఎస్.పీ, బీఎస్పీ కలయిక: గులాబీదళంలో ఉత్సాహం

            జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీల‌కు వ్య‌తిరేకంగా తెర‌పైకి వ‌స్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వ‌చ్చింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు ఆరెండు పార్టీల‌కు దూరంగా ఉండేందుకు ఉత్త‌రాదిన ఉన్న  ప్రధాన పార్టీలు నిర్ణ‌యాలు తీసుకోవటంతో గులాబి నేత‌ల్లో మ‌రింత‌  ఉత్సాహం నింపుతోంది. ఎన్నిక‌ల నాటికి దేశ వ్యాప్తంగా  ప్రాంతీయ పార్టీల మ‌ద్దతును గులాబి బాస్ పెద్దఎత్తున కూడ‌గ‌డుతార‌న్న ధీమా నేత‌ల్లో వ్య‌క్తంఅవుతోంది.
           జాతీయ  రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు అన్న నినాదంతో ఫెడరల్  ఫ్రంట్ ఏర్పాటుకు ముందుకు వెళుతున్న  తెలంగాణా సిఎం కేసిఆర్ కు  ప్రస్తుత రాజ‌కీయ ప‌రిణామాలు క‌లిసి వ‌చ్చేలా చోటు చేసుకుంటున్నాయి. ప‌లు ప్రాంతీయపార్టీల అధినేత‌ల‌తో ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపిన కేసిఆర్ త్వ‌ర‌లో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మ‌ద్ద‌తుగా మ‌రిన్ని రాజ‌కీయపార్టీల మ‌ద్ద‌తు  కూడ గ‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా కొత్తకూట‌మిని కేసిఆర్ తెర‌పైకి తెస్తున్నారు. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఒడిషా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల్లో కేసిఆర్ ప‌ర్య‌టించి    ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌ధాన‌ పార్టీల అధినేత‌ల‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర‌ల హ‌క్కుల కోసం ఉద్య‌మించాల్సిన అవ‌స‌రాన్ని వివ‌రిస్తూ….ప్రాంతీయ పార్టీలకు ఏకం చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. శనివారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో కూడా రాష్ట్రాల హక్కులను కేంద్రం  కాలరాస్తోందటూ  కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.  
        దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో రాజ‌కీయంగా చోటు చేసుకుంటున్న‌ప‌రిణామ‌లు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని అధికార టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. యుపీలో అధికారంలో ఉన్న బీజ‌ేపీని రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఢీ కొట్టేందుకు స‌మాజ్ వాది పార్టీ, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీలు ఏకం కావ‌డం స్థానిక అధికారపార్టీ నేత‌ల్లో మ‌రింత జోష్ నింపుతోంది. కాంగ్రెస్, బీజేపీల‌కు ఆరెండు పార్టీలు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో రాజ‌కీయంగా ఫ్రంట్ కు భారీ మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న ధీమా గులాబి నేత‌ల్లో క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసిఆర్ తో, అఖిలేష్ హైద‌రాబాద్ లో ఓసారి భేటీఅయి కేసిఆర్ ఏర్పాటు చేస్తున్న‌ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్  నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. ఇటీవ‌ల కేసిఆర్ ఢిల్లీ టూర్ లో మ‌రోసారి అఖిలేష్ తో భేటీ కావాల్సి ఉంది, కాని అది సాధ్యంకాకపోవ‌డంతో త్వ‌ర‌లో హైద‌రాబాద్ వ‌చ్చి కేసిఆర్ ను క‌లుస్తానని అఖిలేష్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో యుపీలో జ‌రిగే రాజ‌కీయ ప‌రిణామాలు గులాబి బాస్ కేసిఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన‌ యూపీ కి చెందిన ప్రాంతీయ పార్టీలు త‌మ‌తో క‌లిసి వ‌చ్చే అవ‌క‌ాశాలు మ‌రింత పెరుగుప‌డ్డాయ‌న్న ధీమా గులాబినేత‌ల్లో క‌నిపిస్తోంది.
             ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు నాటికి  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డే అవ‌కాశం ఉండ‌డంతో, జనవరి నెలాఖ‌రు త‌ర్వాత ఫెడ‌ర‌ల్ ఫ్రంట్  ఏర్పాటు దిశ‌గా  కేసిఆర్ ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని అధికార పార్టీ నేత‌లు చెపుతున్నారు.