Navaratri 2023 : సంతానం, సౌభాగ్యం ప్రసాదించే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటిరోజు దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజలందుకుంటున్నారు. ఈరోజు బాలార్చన చేస్తారు. అమ్మవారు అనుగ్రహిస్తే సత్సంతానం కలుగుతుంది.

Navaratri 2023
Navaratri 2023 : శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 15 నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 24 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో రోజుకో అవతారంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో పూజలు అందుకోబోతున్నారు. మొదటి రోజు ‘శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా’ అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈ అవతారం గురించి.. అలంకరణ గురించి తెలుసుకుందాం.
Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?
నవరాత్రుల్లో మొదటి రోజు దుర్గమ్మ ‘బాలత్రిపుర సుందరి’ గా దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబి రంగు చీరను అలంకరిస్తారు. అమ్మవారికి ఇష్టమైన తుమ్మి పూవులతో పూజ చేస్తారు. బెల్లపు పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు రవికుల గుడ్డ దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. సద్బుద్ధి కార్యసిద్ధి లభిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి అంటే ఈశ్వరుడి భార్య గౌరీదేవి అని అర్ధం. అమ్మను ఆరాధిస్తే మానసిక బాధలు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. త్రిపురసుందరీ దేవి అనుగ్రహం కోసం ఈరోజు బాలార్చన చేస్తారు. ఈ దేవత అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. ఈరోజు రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెడతారు.
Dussehra 2023: శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు.. అలంకరణలు.. విశిష్టతలు
బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు ఉండేవారు. ఇంద్రాది దేవతల్ని గడగడలాడించిన భండాసుర పుత్రుల్ని హంసలు లాగుతున్న కన్యక రథంపై వచ్చి అమ్మవారు వారందరినీ సంహరించిందట. అరివీర భయంకరులైన రాక్షసులందరినీ కేవలం ఒకే ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనిపించినా అమ్మవారి బలం తక్కువ కాదు. బాలా త్రిపురసుందరి దేవిని ఈరోజు ‘ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే పుణ్యం లభిస్తుంది. అమ్మవారిని పూజిస్తే శత్రువులు నశిస్తారు. ధనం వృద్ధి చెందుతుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి.