కాళేశ్వరం ఓ యజ్ఞం : గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం

కాళేశ్వరం ఓ యజ్ఞం : గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం

CM KCR Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చివేసిందన్నారు సీఎం కేసీఆర్. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు. ప్రస్తుతం బ్యారేజీల దగ్గర పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని, వచ్చే ఎండాకాలమంతా.. ఈ ప్రాజెక్టు జలాలతోనే రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సీఎం కేసీఆర్ సందర్శించారు. సతీమణి శోభతో పాటు మంత్రులు, ఇతర నాయకులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి.. గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన తర్వాత.. కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత.. ఇరిగేషన్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేసిన.. నీటిపారుదల శాఖ అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను సీఎం అభినందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అనుకున్న నిర్మాణాలన్నీ సాఫీగా పూర్తయ్యాయని.. నీటి పంపింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతోందని కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పాయింట్ నుంచి ప్రాణహితలో 54 కిలోమీటర్ల వరకు, గోదావరిలో 42 కిలోమీటర్ల వరకు నీరు నిల్వ ఉండటంతో.. ప్రాజెక్టు జలకళతో ఉట్టిపడుతోందన్నారు. నిజాంసాగర్‌కు కూడా కాళేశ్వరం నుంచే నీరందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. అవసరమైతే.. ఎస్సారెస్పీకి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే నీటి పంపింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

కాళేశ్వరం స్ఫూర్తితోనే.. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. వీటిని త్వరితగతిన పూర్తి చేసి.. రైతుల సాగునీటి గోసను శాశ్వతంగా రూపుమాపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీల దగ్గర కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించి.. సమయానుగుణంగా వాటిని అమలు చేయాలని సీఎం కేసీఆర్ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.