తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న జాతీయ పార్టీకి భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది

  • Published By: naveen ,Published On : November 25, 2020 / 12:37 PM IST
తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న జాతీయ పార్టీకి భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది

congress in shock: దుబ్బాక ఉప ఎన్నిక‌ ఫ‌లితం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చనీయాంశమైంది. రాజ‌కీయ‌ పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ విష‌యానికొస్తే.. పూర్తి ఆత్మర‌క్షణ‌లో ప‌డిందనే చెప్పాలి. తెలంగాణ ముఖచిత్రంలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వ‌చ్చిన పార్టీకి… దుబ్బాక ఫ‌లితం అస్సలు మింగుడు ప‌డ‌టంలేదు. వాస్తవానికి ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోయినా.. క‌నీసం రెండో స్థానంలో నిలిచి రాజ‌కీయంగా ప‌ట్టు నిలుపుకోవాల‌ని భావించింది. అందుకు అనుగుణంగా మండలాల‌కు ముఖ్యనేత‌లను ఇన్‌చార్జులుగా నియమించడంతో పాటు ప్రతీ గ్రామానికి ఒక ఇన్‌చార్జి వ్యూహంతో గ‌ట్టిగానే త‌ల‌ప‌డింది. కానీ, ఫలితం మాత్రం తారుమారైంది.

కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు:
దుబ్బాక‌లో కాంగ్రెస్ శ్రేణులు చేసిన ప్రయ‌త్నం పూర్తిగా విఫ‌ల‌మైంది. ఏ ఒక్క మండ‌లంలో కూడా గ‌ట్టి ప్రభావం చూప‌లేక‌పోయింది. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సొంత మండలమైన తోగుట్టలో మాత్రం 23 శాతం ఓట్లు సాధించి ప‌రువు నిలుపుకోగ‌లిగింది. సీనియ‌ర్లయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భ‌ట్టి విక్రమార్క, వి.హ‌నుమంత‌రావు, రేవంత్ రెడ్డి, ష‌బ్బీర్ అలీ, జీవ‌న్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు లాంటి నేత‌లు ఇన్‌చార్జులుగా ప్రచారం చేసినా కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. గ్రామాల్లో చాలా చోట్ల కేడ‌ర్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి ఫలితం వచ్చిందని నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కేడర్ ను కాపాడుకోకపోతే గ్రేటర్ లోనూ పరాభవం తప్పదు:
ఎన్నికల బ‌రిలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిల‌వ‌డం వ‌ల్లే ఈ కాస్త ఓట్లు అయినా వ‌చ్చాయ‌ని, వేరే ఏ నాయ‌కుడైనా పోటీ చేసి ఉంటే కనీసం ప‌దివేల ఓట్లు కూడా సాధించడం కష్టమైపోయేదని అంటున్నారు. ఫైన‌ల్‌గా భ‌విష్యత్తులో పార్టీ ప‌రిస్థితి ఏంట‌నే విషయంలో నేత‌లు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.


https://10tv.in/pv-ntr-graves-should-be-demolished-mim-mla-akbaruddin-owasi/
ఇప్పటి వ‌ర‌కు అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్నామ‌ని చెప్పుకున్న మాట‌ల‌న్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ ప్రభావం రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నిక‌ల‌పై ప‌డే అవ‌కాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక నుంచైనా కేడ‌ర్‌ను నిల‌బెట్టుకోక‌పోతే దుబ్బాక ప‌రిస్థితి మళ్లీ మళ్లీ ఎదురు కాక తప్పదని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి.