Dalita Bandhu : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ.10లక్షలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళిత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.

Dalita Bandhu : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ.10లక్షలు

Dalita Bandhu

Dalita Bandhu : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దళితబంధు పథకం ప్రయోజనాలను నిరుపేద దళితులతో పాటు దళిత ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు. హుజురాబాద్‌లోని శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రైతు బంధు పథకం తరహాలోనే దళితబంధు పథకం కూడా దళితులందరికీ అందిస్తామని అన్నారు. ఈ పథకంతో దళితుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతూ.. ఈ పథకం ఓ కొత్త చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చివరి వరుసలో దళిత ఉద్యోగులు దళిత బంధు తీసుకోవాలని కేసీఆర్ చెప్పారు.

దళిత బంధు అనగానే.. కిరికిరి గాల్లు మొదలయ్యారని కేసీఆర్ మండిపడ్డారు. ఇచ్చేటోడు ఇస్తాడు.. తీసుకునేటోడు తీసుకుంటాడు.. మధ్యలో మీదేంది అని ప్రశ్నించారు. సమగ్ర సర్వే ప్రకారం హుజురాబాద్ లో 21 వేల దళిత కుటుంబాలున్నాయని.. ప్రతీ కుటుంబానికి రూ.10లక్షలిస్తామని స్పష్టం చేశారు.

కరోనా కారణంగా ఈ పథకాన్ని ఏడాది ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే కాదు.. యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ఇలా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ ఆలోచించ లేదని, అందుకే ఇదొక చరిత్ర సృష్టించే పథకం అవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ”ఈ స్కీం కొత్త చరిత్రను సృష్టించే పథకం. మహా ఉద్యమంలా కొనసాగాలి. దళిత బంధుతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ స్కీమ్ దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. సక్సెస్ చేసి చూపుతాం” అని కేసీఆర్ అన్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనియాంశమైంది. ఎప్పుడైతే సీఎం కేసీఆర్ దళితబంధు పథకంపై ప్రకటన చేశారో.. అప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది. దళితబంధు పథకం ఎన్నికల స్టంట్ అని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసమే తీసుకొచ్చారని, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ ఈ పథకాన్ని కూడా అటకెక్కిస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.