గులాబీ జెండా ఎగరడం పక్కా..డిసెంబర్ 07 నుంచి వరద సాయం – KCR

  • Published By: madhu ,Published On : November 29, 2020 / 06:47 AM IST
గులాబీ జెండా ఎగరడం పక్కా..డిసెంబర్ 07 నుంచి వరద సాయం – KCR

Chief Minister K Chandrasekhar Rao

flood relief from december 07 kcr : ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా.. గ్రేటర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. గతంలోకంటే మరో నాలుగు సీట్లు అదనంగా గెలుస్తామన్నారు. ఓట్లేసే ముందు ప్రజలు అన్ని రకాలుగా బేరీజు వేసుకోవాలని కేసీఆర్‌ కోరారు. ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న కేసీఆర్‌.. స్థిరాస్తి వ్యాపారులకు ఏం కావాలో తేల్చుకోవాలన్నారు. ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన సభలో గ్రేటర్‌ ప్రజలపై మరిన్ని వరాలు కురిపించారు.



గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి ఒకరోజు ముందు టీఆర్‌ఎస్‌ ఎల్‌బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభకు వచ్చిన కార్యకర్తల్లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ తన ప్రసంగంతో జోష్‌ నింపారు. ఆరేళ్ల కాలంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. హైదరాబాద్‌ ప్రశాంతతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీని కేసీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌ శాంతియుతంగా ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయన్నారు. స్థిరాస్తి వ్యాపారులూ.. మీకు బీపాస్‌ కావాలో… కర్ఫ్యూపాస్‌ కావాలో ఆలోచించుకోవాలని కేసీఆర్‌ కోరారు. ఎన్నికల్లో ఓటేసే ముందు నేతల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలని కేసీఆర్‌ కోరారు. పార్టీల దృక్పథం ఏ విధంగా ఉందో చూసుకోవాలన్నారు. వారి ప్రణాళికలు, ఏజెండాపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. అప్పుడే సరైన నాయకుడు అధికారంలోకి వస్తాడని.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడివిల్లుతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు.



హైదరాబాద్‌లో వరదలు రాకుండా ఉండాలంటే మాటలు చెపితే సరిపోదని.. ప్రతి ఏడు 10 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు సీఎం కేసీఆర్‌.. నాలాలు కబ్జాకు గురయ్యాయని.. వాటిని తొలగించేందుకు దీర్ఘ కాలిక ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.. టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా ఈ పని చేసి తీరుతుందన్నారు. రాబోయే కొద్ది ఏళ్లలో హైదరాబాద్‌లో 24 గంటల పాటు నీరు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌.. ఇప్పటికే పేద, మధ్యతరగతి వారికి 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి అపార్ట్‌మెంట్‌ వాసులకూ… నల్లా బిల్లులు రద్దు చేస్తామని హామీనిచ్చారు కేసీఆర్‌.



హైదరాబాద్‌ అభివృద్ధిపై తాము ఎక్కడా రాజీపడే సమస్యే లేదన్నారు కేసీఆర్‌. నగర భవిష్యత్‌కు యువత, మేధావులు కంకణం కట్టాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీలో బ్రహ్మాండంగా విజయం సాధించబోతున్నామని, గతంకంటే నాలుగు సీట్లు ఎక్కువే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరద సాయాన్ని మళ్లీ అందించనున్నట్టు కేసీఆర్‌ తెలిపారు. డిసెంబర్‌ 7నుంచి లబ్దిదారులకు పదివేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటు గ్రేటర్‌ వాసులపై మరికొన్ని వరాలు ప్రకటించారు కేసీఆర్‌.