వరద పోయింది..బురద మిగిలింది..కన్నీటిని మిగిల్చింది

  • Published By: madhu ,Published On : October 24, 2020 / 10:44 AM IST
వరద పోయింది..బురద మిగిలింది..కన్నీటిని మిగిల్చింది

Greater Hyderabad Flood hardships : వరద పోయింది… బురద మిగిలింది… కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. బియ్యం, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రానిక్‌ సామాన్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇన్నాళ్లు పరాయి ప్రాంతాల్లో తలదాచుకుని వరద తగ్గడంతో సొంత ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు అక్కడి పరిస్థితిని చూసి గొల్లుమంటున్నారు.



వరద తమకు కన్నీళ్లు మినహా ఇంకే మిగల్చలేదని వాపోతున్నారు. ఇన్నాళ్ల కష్టాన్ని ఊడ్చిపెట్టుకుపోయిందని వాపోతున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారిలో ఎక్కువమంది మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారే.. పైసాపైసా కూడబెట్టి కొనుక్కున్న వస్తువులన్నీ సర్వనాశనం అయ్యాయి. దారుణంగా దెబ్బతిన్న ఇళ్లు, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేసుకొనే పనిలో పడ్డారు.



వర్షం మిగిల్చిన బీభత్సం నుంచి హైదరాబాద్‌ నగరం నెమ్మదిగా కోలుకుంటోంది. 10 రోజుల క్రితం సృష్టించిన విలయం నుంచి భాగ్యనగరం కుదుటపడుతోంది. ముంపులో చిక్కుకున్న కాలనీల్లో సాధారణ పరిస్థితి నెలకొంటోంది. వరదనీరు పోయినా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. వరదతో పాటు భారీగా వచ్చిన మట్టి ఎక్కడికక్కడ పేరుకుపోయింది.



రోడ్లపై పేరుకుపోయిన మట్టిని GHMC అధికారులు తొలగిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చాలా కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. నదిలోని చెత్తాచెదారమంతా కాలనీల్లో మేట వేసింది. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తను GHMC యుద్ధప్రాతిపదికన తరలిస్తోంది. ఇప్పటివరకూ దాదాపు 13వేల టన్నుల చెత్తను తొలగించారు.



ముంపు ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి చేరిన వరదనీరు పూర్తిగా పోలేదు. దీంతో తాగునీరు, కరెంట్ సరఫరా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల మోటర్లు కాలిపోవడం, పాడైపోవడంతో నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీటిని తోడుతున్నప్పటికీ ఊట సమస్య తలెత్తుతోంది. చెరువు, కుంటల పరివాహక ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. బల్దియా అధికారులు 6 వందలకు పైగా సెల్లార్లలోని నీటిని తోడినప్పటికీ మళ్లీ నీరు ఊరుతోంది. హైదరాబాద్‌లో 13 వందలకు పైగా సెల్లార్లు నీట మునిగినట్లుగా అధికారులు గుర్తించారు.



నాచారం, సరూర్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, ఫాక్స్‌సాగర్‌ చెరువల నుంచి వస్తున్న ప్రవాహం తగ్గడంతో కాలనీల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సరూర్‌నగర్‌ చెరువు శాంతించినప్పటికీ వరద కాలనీల్లో రోడ్లు బురదయమయ్యాయి. ఉప్పల్‌ బండ్లగూడ చెరువుకు గండి కొట్టడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ముంపులోనే కొనసాగుతున్నాయి.



మూడు కాలనీల్లోకి వారం రోజుల వరకూ అడుగుపెట్టే పరిస్థితి లేదు. గుర్రం చెరువుకు గండి పడటంతో దెబ్బతిన్న హఫీజ్‌ బాబానగర్‌ ఇంకా కోలుకోలేదు. వనస్థలిపురం సమీపంలోని కప్రాయ్‌ చెరువు బ్యాక్‌వాటర్‌ ఇంకా కొన్ని కాలనీల్లో పారుతోంది. వర్షాలు లేకుంటే ఈ నీరు పూర్తిగా వెళ్లిపోవడానికి మరో వారం రోజులపైనే పడుతుందంటున్నారు.