విద్యా విధానంలో కొత్త రూల్స్ : స్కూల్స్ లో సరి – బేసి విధానం

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 08:07 AM IST
విద్యా విధానంలో కొత్త రూల్స్ : స్కూల్స్ లో సరి – బేసి విధానం

కరోనా వైరస్..ఎన్నో జీవితాలను ప్రభావితం చేసింది. కొత్త కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడంతో జన జీవనం స్తంభించిపోయింది. స్కూల్స్, కాలేజీలు, ఇనిస్టిట్యూట్స్ కు తాళాలు పడిపోయాయి. విద్యా సంవత్సరం చాలా లేటుగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యా రంగంలో భారీ మార్పులు తీసుకరావాలని కేంద్రం భావిస్తోంది. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు స్కూళ్ల సమయాలు, ఇతరత్రా అంశాల్లో మార్పులు తీసుకరావాలని యోచిస్తోంది. సరి – బేసి విధానాన్ని తీసుకొస్తారని అంచనా. 

దీనిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆలోచిస్తున్నాయి. పాఠశాలలో భౌతికదూరం పాటించాలనే ఉద్దేశ్యంతో సరి – బేసి విధానాన్ని ఆలోచిస్తున్నారని సమాచారం. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ విధానాన్ని అవలంబించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఒకరోజు సగం తరగతుల విద్యార్థులు మరోరోజు సగం తరగతుల విద్యార్థులు హాజరయ్యేలా ఆలోచన చేస్తున్నారు. దీనివల్ల భౌతికదూరం పాటించే విధానం సులువు అవుతుందని అధికారులు అనుకుంటున్నారు. 

ఇంటి దగ్గర ఉండే విద్యార్థులకు సమయం వృథా కాకుండా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంట్లో ఉండే స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు చదువులో వెనుకపడరని అనుకుంటున్నారు. మరి ఈ విధానం దేశం మొత్తం ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారా ? లేక కరోనా వైరస్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తారా ? అనేది చూడాలి మరి. 

Also Read | ఇది విన్నారా! ఆడియో బుక్స్ ఫ్రీ.. లాగిన్ అవడమే ఆలస్యం